బౌద్ధ మతం

వికీపీడియా నుండి
(Buddhism నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Like
బొజ్జన్నకొండ బౌద్ధారామం, విశాఖ జిల్లా. వద్ద ధ్యాన బుద్ధుని ప్రతిమ (రాతిలో చెక్కబడినది)
థాయిలాండ్‌లో బుద్ధుని చిత్రం
గుంటుపల్లి స్తూపాలు - హీనయానం కాలం - క్రీ పూ 200 నాటివి

బౌద్ధ మతం లేదా బౌద్ధం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.[1] బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి - మహాయానం, థేరవాదం.[2] తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు "మహాయాన సూత్రాలు" అనే రచనను విశ్వసిస్తారు. దీనిని థేరవాదులు అంగీకరించరు.[3]

ప్రధాన సంప్రదాయాలు

[మార్చు]

థేరవాద, మహాయాన సంప్రదాయాలు బౌద్ధంలో ఉన్న రెండు ప్రధాన విభాగాలు. ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. కాని వీటన్నింటిలో ఏకాభిప్రాయంగా పరిగణింపబడే ముఖ్య సూత్రాలను చెప్పడానికి నిపుణులు ప్రధానంగా పాళీ భాష, టిబెటన్ భాష లోనూ, ఇంకా అనువాద రూపంలో ఉన్న మంగోలియన్, చైనా భాషల గ్రంథాలలోనూ, కొద్దిగా లభించే సంస్కృత మూలాలలోనూ ఉన్న విషయాల ఆధారంగా కొన్ని ప్రధాన సూత్రాలను ఉదహరిస్తారు. అయితే వీటిలో భిన్నాభిప్రాయాలు, భిన్న సంప్రదాయాలు ఉండవచ్చును.

  • మధ్యేమార్గం, కార్య కారణత్వం, నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - వీటిని సిద్ధాంతపరంగా అంగీకరిస్తారు. కాని కొన్ని సంప్రదాయాల ఆచరణలో వీటిని (కొంత గాని, పూర్తిగా గాని) అమలు చేయకపోవచ్చును.
  • సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును.
  • నిర్వాణం పరమోత్కృష్ట గమ్యమని భావిస్తారు. థేరవాదులుల నమ్మకం ప్రకారం బుద్ధుడు పొందిన నిర్వాణమే ఇతరులకూ లభిస్తుంది, రెండు రకాల నిర్వాణాలుండవు. ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు మొదటిగా కనుక్కొని ఇతరులకు బోధించాడు.
బుద్ధుడు

ఆరంభం, చరిత్ర

[మార్చు]
ధ్యానమగ్నుడైన గౌతమబుద్ధుని దీక్ష భగ్నం చేయడానికి మారుడు దండెత్తడం - సూచనా శిల్పం - అమరావతి స్తూపం - గ్విమెట్ మ్యూజియం నుండి.
అమరావతిలో బుద్ధుని విగ్రహము

బౌద్ధ ధర్మాన్ని మొదటిగా బోధించిన గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు లుంబిని[4] అనే చోట జన్మించాడు. కపిలవస్తు[5] అనే నగరంలో పెరిగాడు. ఇతని తండ్రి శుద్ధోదనుడు అనే రాజు. తల్లి మాయాదేవి

మహా స్తూపం తొట్లకొండ, విశాఖపట్నం

సిద్ధార్థుని తాత్విక అన్వేషణ గురించి బహుళంగా ప్రచారంలో ఉన్నకథ - సిద్ధార్థుని జననం తరువాత అతని తండ్రి శుధ్ధోదనునికి "ఈ బాలుడు మునుముందు గొప్ప చకవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడు" అని పండితులు జోస్యం చెప్పారు. తన కుమారునికి వైరాగ్యం కలుగరాదనే కోరికతో తండ్రి అతనికి బయటి లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలలో పెంచాడు. యశోధర అనే చక్కని యువతితో వివాహం జరిపాడు. వారికి రాహులుడనే పుత్రుడు జన్మించాడు. కాని తన 29వ యేట సిద్ధార్థుడు నగరంలో ప్రయాణిస్తుండగా జనుల కష్టాలను, ఒక పండు ముసలివానిని, ఒక శవాన్ని, ఒక సాధువును చూచాడు. ఈ దృశ్యాలను "నాలుగు దృశ్యాలు" అంటారు.[6]

ఈ దృశ్యాలను చూచిన సిద్ధార్థుని మనసు తాత్విక చింతనవైపు మళ్ళింది. ఒకరాత్రివేళ తన కుటుంబాన్ని, రాజ భోగాలను వదలి రాజప్రాసాదంనుండి నిష్క్రమించాడు. సత్యాన్వేషణకై వివిధ మార్గాలను ప్రయత్నించాడు. కొంతకాలం కఠోరమైన దీక్షను సాగించాడు. కాని ఆ విధంగా శరీరాన్ని మనసును క్షోభ పెట్టడం నిరర్థకమని తెలుసుకొన్నాడు.[7]

తరువాత దీక్షను అవలంబించాడు. అతిగా సుఖలోలత లేకుండా, కఠోరమైన యోగదీక్ష కాకుండా మధ్యేమార్గంలో పయనించాలని నిశ్చయించుకొన్నడు. ఒక గ్రామ యువతి ప్రసాదించిన భిక్షను ఆరగించి, బోధగయలో ఒక రావి చెట్టు క్రింద ధ్యానమగ్నుడయ్యాడు. ఈ చెట్టునే బోధివృక్షమంటారు.[8][9] పరమ సత్యాన్ని కనుగొనేవరకూ కదలరాదని నిశ్చయించుకొన్నాడు. 49 రోజుల ధ్యానం తరువాత అతనికి జ్ఞానోదయమైంది. అప్పటినుండి అతను బుద్ధుడు అయ్యాడు. తాను కనుగొన్న ధర్మాన్ని అందరికీ బోధించసాగాడు.[10]

గౌతమ బుద్ధుడు సా.శ.పూ. 5వ శతాబ్దంలో జీవించాడని పరిశోధకుల అంచనా. కాని అతని జన్మ దినం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి.[11] తన 80వ యేట కుశీనగరంలో మరణించాడు.[12]

ఆరంభ దశ

[మార్చు]

బౌద్ధమతం చరిత్రను క్రింది దశలుగా విభజింపవచ్చును.[13]

  1. ఆరంభ బౌద్ధం - ఈ దశను "హజిమె నకమురా" అధ్యయనకారుడు మళ్ళీ రెండు దశలుగా విభజించాడు.[14]:
    • అసలు బౌద్ధం - బుద్ధుడు బోధించింది (మతంగా రూపొందంది)
    • సనాతన బౌద్ధం - ఆరంభ దశలో
  2. బౌద్ధ సిద్ధాంతం ఆరంభ దశ - నికాయ బౌద్ధం
  3. మహాయానం ఆరంభ దశ
  4. మహాయానం పరిణతి దశ
  5. వజ్రయానం

అయితే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వచ్చిన దశలు అనలేం. ఉదాహరణకు మహాయానం ఆవిర్భవించిన తరువాత చాలాకాలం వరకు సనాతన బౌద్ధం అధిక ప్రాభవం కలిగి ఉంది.

సుత్త పిటక, వినయపిటక
[మార్చు]

ఆరంభ దశలో బౌద్ధం సుత్త పిటకం, వినయ పిటకం అనే మౌలిక పాళీ సూత్రాలపైన, నాలుగు నికాయ (ఆగమ) సూత్రాలపైన ఆధారపడింది (కొద్దిమంది పరిశోధకులు మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు[15] . దాదాపు అన్ని ఆరంభకాలపు రచనలలోనూ కనిపించే క్రింది సిద్ధాంతాలు బుద్ధుని బోధనలనుండి నేరుగా గ్రహించబడినవని భావిస్తున్నారు.[16]

  • మూడు లక్షణాలు లేదా జీవ ధర్మాలు - అనిత్యం, దుఃఖం, అనాత్మత - (పాళీ భాషలో అనిచ్చ, దుక్క, అనత్త)
  • ఐదు తత్వాలు లేదా పంచ కంధాలు - ఆకారం (రూపం), వేదన (బాధ), సంజ్ఞ (ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం), సంస్కారం (భావనలు కలగడం), విజ్ఞానం
  • ప్రతి సముత్పాదన లేదా కార్యకారణత్వం - ఒక దాని కారణంగా మరొకటి జరగడం
  • కర్మ, పునర్జన్మ
  • నాలుగు మహోన్నత సత్యాలు - చత్వారి ఆర్య సత్యాణి - దుఃఖము (జన్మ, జీవితం, మరణం కూడా దుఃఖ మయాలు), సముదాయము (సుఖ కాంక్ష వలన దుఃఖం కలుగుతుంది), నిరోధం (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), మార్గం (అష్టాంగ మార్గం వలన కాంక్షను త్యజింపవచ్చును)
  • అష్టాంగ మార్గం - సమ్యగ్వచనం (మంచిమాట), సమ్యగ్‌కర్మ (మంచి పనులు), సమ్యగ్‌జీవనం (మంచి జీవితం), సమ్యగ్‌వ్యాయామం (మంచి ప్రయత్నం), సమ్యగ్‌స్మృతి (మంచి దృక్పధం), సమ్యగ్‌సమాధి (మంచి ధ్యానం), సమ్యగ్‌దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్‌సంకల్పం (మంచి సంకల్పం)
  • నిర్వాణం - కొందరు పరిశోధకులు వేరే ప్రమాణాలను ప్రతిపాదించారు.[17]

సంఘాలు

[మార్చు]
బౌద్ధ సన్యాసులు. (అనుపు, నాగార్జున సాగర్ వద్ద)

బుద్ధుని పరినిర్వాణం తరువాత కొద్ది కాలానికే మొదటి బౌద్ధ మండలి సమావేశమయ్యంది. బుద్ధుని అమూల్య బోధనలు కలుషితం కాకుండా వాటిని గ్రంథస్తం చేయడం ఈ మండలి సంకల్పం. బుద్ధుని సన్నిహితుడైన ఆనందుడు తెలిపిన సూత్రాలు సుత్త పిటకం అనీ, మరొక శిష్యుడు ఉపాలి చెప్పిన విషయాలు వినయ పిటకం అనీ ప్రసిద్ధి చెందాయి.[18]సుత్త పిటకంలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. వినయ పిటకంలో బౌద్ధ సంఘంలో ఉండేవారి లక్షణాల గురించి చెప్పబడింది (భిక్షువుల ధర్మాలు). రెండవ బౌద్ధ మండలి తరువాత బౌద్ధంలో వివిధ శాఖలు పొడసూపనారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు.[19] అశోకుని తరువాతనే ఈ శాఖా భేదాలు బలవంతమయ్యాయని కొందరి అభిప్రాయం.

అశోకుడు పాటలీ పుత్ర నగరంలో మూడవ బౌద్ధ మండలిని నిర్వహింప జేశాడు. అయితే కొందరు అబౌద్ధులను సంఘంలోంచి వెలివేసి, సంఘాన్ని ఏకీకృతం చేసినట్లు మాత్రమే అశోకుని శాసనాలు చెబుతున్నాయి. స్థవిరులు అనబడే వారు, మహాసాంఘికులు అనబడేవారు "వినయం" గురించి గట్టిగా ఒకరినొకరు వ్యతిరేకించారు. సంఘంలో ఉండవలసిన వారి అర్హతల గురించి ఈ విభేదాలు పొడసూపాయి. కొంత కాలం ఒకే సంఘారామంలో ఇరు వర్గాలవారు కలసి ఉండి ఉండవచ్చును. కాని సుమారు సా.శ. 100 నాటికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని ఉంటారు.[20] స్థవిరులలోంచి వచ్చిన మరొక శాఖ థేరవాదంగా పరిణమించింది. స్థవిరులు సంఘం అర్హతలుగా ప్రతిపాదించిన నియమాలు మరీ కఠినంగా ఉన్నాయని మహాసాంఘికులు అభిప్రాయపడ్డారు.[21]

అనంతర పరిణామాలు

[మార్చు]
అశోకుని కాలంలో బౌద్ధమతం విస్తరణ (క్రీ.పూ.260–218).
బౌద్ధ రచనల ప్రకారం 2వ శతాబ్దానికి చెందిన ఇండో-గ్రీక్ రాజు "1వ మెనాందర్" బౌద్ధమతాన్ని స్వీకరించాడు.

ఈ విధమైన విభేదాల ఫలితంగా ఒకో శాఖ తమదైన "అభిధమ్మము" (సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు) ఏర్పరచుకోవడం ప్రాంభించింది. బౌద్ధం విస్తరించిన కొలదీ అభిధమ్మ పిటకం అనే వ్యవస్థీకృత సిద్ధాంతం రూపొందింది. బుద్ధుని సందేశాల పరిధిని విస్తరించడానికి ఇష్టం లేని మహాసాంఘికులు మాత్రం వేరే అభిధమ్మపిటకాన్ని తయారు చేసుకోలేదు అనిపిస్తుంది. అయితే 5వ శతాబ్దానికి చెందిన ఫాహియాన్, 7వ శతాబ్దానికి చెందిన హ్యూన్‌త్సాంగ్ రచనల ప్రకారం మహాసాంఘికులకు కూడా ఒక అభిధమ్మం ఉంది.

ఆరంభంలో భారతదేశంలో నిదానంగా వ్యాపించిన బౌద్ధం అశోకుని కాలంలో దేశం నలుమూలలా, దేశాంతరాలలోనూ విస్తరించింది. ఈ కాలంలోనే అనేక స్తూపాల నిర్మాణాలు జరిగాయి. ధర్మ పధాన్ని ప్రచారం చేయడానికి అశోకుని దూతలు దేశదేశాలు ప్రయాణమయ్యారు. శ్రీలంకకు, సెల్యూసిడ్ రాజ్యాలకు, మధ్యధరా రాజ్యాలకు బౌద్ధ భిక్షువులు తరలి వెళ్ళారు. ఇలా దేశపు ఎల్లు దాటిన బౌద్ధం ఒకవైపు శ్రీలంకకు, అటునుండి క్రమంగా ఆగ్నేయ ఆసియా దేశాలకు వ్యాపించింది. మరొకవైపు మధ్య ఆసియా, ఇరాన్ ప్రాంతాలకు విస్తరించి, చైనాలో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకొంది. కాలక్రమంగా శ్రీలంక, ఆగ్నేయాసియాలలో థేరవాద బౌద్ధంగాను, టిబెట్, చైనాలో తాంత్రిక లేదా వజ్రయాన ప్రభావితమైన బౌద్ధంగాను పరిణమించాయి. ఈ కాలంలో బౌద్ధ సంఘంపై ఇతర నాగరికతల ప్రభావం మరింతగా పడసాగింది. అంతే కాకుండా భారతదేశంలో ఇతర (బౌద్ధం కాని) మతాలు బౌద్ధం వలన ప్రభావితం కాగా, బౌద్ధం ఆ మతాలవలన కూడా ప్రభావితమవ సాగింది.

మహాయానం ప్రాభవం

[మార్చు]
చైనాలో సా.శ. 650 "టాంగ్" వంశపు కాలం నాటి బుద్ధ విగ్రహం - చైనా బౌద్ధం మహాయాన సంప్రదాయానికి చెందినది. అందులో ఇప్పుడు "Pure Land", "జెన్" అనే రెండు ప్రధాన శాఖలున్నాయి.
1 నుండి 10వ శతాబ్దంలో మహాయానం విస్తరణ.

మహాయానం ఆరంభం ఎలా ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియడంలేదు. సుమారు 1వ శతాబ్దంలో పశ్చిమోత్తరాన కుషాను రాజ్యంలోను, దక్షిణాన శాతవాహనుల దేశంలోను, పశ్చిమాన భరుకచ్చం (భారుచ్) సమీపంలో అజంతా, ఎల్లోరా ప్రాంతాలలోను ఆవిర్భవించిన వివిధ దృక్పథాల సంగమమే మహాయానం కావచ్చును. స్తూపాలను పూజించడం, బోధిసత్వుని గాథలను చిత్రాల ద్వారా సామాన్యులలో ప్రచారం చేయడం అనే విధానాలు మహాయానం ఆవిర్భవానికి మూల ఘటనలు కావచ్చును. కాని ఈ అభిప్రాయాన్ని కొందరు పండితులు త్రోసిపుచ్చుతున్నారు.[22] మహాయానం సిద్ధాంతాలలో "సర్వస్తివాదం", "ధర్మగుప్తకం" అనే రెండు తెగల ప్రభావం ఎక్కువగా ఉంది.

మహాయానులు బోధిసత్వుని మార్గానికి ప్రాధాన్యతనిస్తారు. 2వ శతాబ్దంలో కుషాణు చక్రవర్తి కనిష్కుడు నాలుగవ బౌద్ధ మండలిని సమావేశపరచాడు. ఈ మండలిని థేరవాదులు అంగీకరించరు. ఈ మండలి సమావేశంలో త్రిపిటకాలకు అదనంగా మరికొన్ని సూత్రాలు (పద్మ సూత్రం, హృదయ సూత్రం, అమితాభసూత్రం వంటివి) ఆమోదం పొందాయి. "అందరికీ" నిర్వాణం లభించడం సాధ్యమేనని ఈ మండలిలో ఆమోదించారు. నిర్వాణం కోసం సాధన చేసేవారికి దైవ స్వరూపులైన బుద్ధులు, బోధిసత్వులు అనే భావాలను ఆంగీకరించారు. నిర్వాణం "అందరికీ" అందుబాటులో ఉన్నందున ఇది "మహాయానం" (పెద్ద బండి) అయ్యింది. అయితే ఈ శాఖ అంతకు ముందే ఉన్న సర్వస్తివాదానికి కేవలం ప్రతిరూపమేనని కొందరు పండితుల అభిప్రాయం.[23]. ఈ సిద్ధాంతాలు గ్రంథస్తం చేయబడి, మధ్య ఆసియా, చైనాలకు దేశాలకు విస్తరించాయి. చైనాలో మరిన్ని మార్పులు జరిగిన మహాయానం ఆ రూపంలో జపాన్, వియత్నాం, కొరియా ప్రాంతాలకు విస్తరించింది.

అయితే మహాయాన బౌద్ధానికి పటిష్ఠమైన సిద్ధాంతాలను ఏర్పరచింది నాగార్జునుడు. సుమారు 150-250 మధ్య కాలానికి చెందిన ఈ ఆచార్యుని ప్రభావం మహాయానంపై అసమానమైనది. త్రిపిటకాల పరిధిలో ధర్మము, మోక్షము, శూన్యత అనే భావాలను ఏకీకృతం చేసి, అనాత్మత, కార్యకారణత్వం వంటి మౌలిక సూత్రాలతో విభేదం లేకుండా పరిష్కరించాడు. నాగార్జునుడు బోధించిన మార్గాన్ని మాధ్యమిక వాదం అంటారు. కనిష్కుల తరువాత గుప్తుల కాలం (4-6 శతాబ్దాలు)లో కూడా బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఒక ప్రక్క నాగార్జునుని మాధ్యమిక వాదము, మరొక ప్రక్క యోగాచార బౌద్ధంగా పరిణమించిన సర్వస్తివాదము తమ తమ అనుయాయులలో బలంగా ఉన్నాయి. ఇలా మాధ్యమిక వాదము, యోగాచారము కలగలిపిన సంప్రదాయాలు ఇండో-టిబెటన్ బౌద్ధానికి మూలాలుగా స్థిరపడ్డాయి.

వజ్రయానం

[మార్చు]

తాంత్రిక ఆచారాలతో కూడుకొన్న వజ్రయాన బౌద్ధం ఆరంభమైన విధానాన్ని గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. టిబెటన్ సంప్రదాయం ప్రకారం శాక్యముని బుద్ధుడే తంత్రాన్ని బోధించాడని, కాని అవి రహస్యాలు గనుక బుద్ధుని అనంతరం చాలా కాలానికి గాని గ్రంథస్తం కాలేదని అంటారు. వజ్రయానం పరిణతిలో నలందా విశ్వవిద్యాలయం ప్రముఖ పాత్ర కలిగి ఉంది. 11వ శతాబ్దం వరకు ఇక్కడినుండి టిబెట్, చైనాలకు ఈ తాంత్రిక విధానాలు సంక్రమించాయి. టిబెటన్ బౌద్ధంలో ఈ విధానాల ప్రభావం బలంగా ఉంది. డేవిడ్ రోనాల్డ్‌సన్ అనే ఆచార్యుని అభిప్రాయం ప్రకారం గుప్తుల అనంతరం బౌద్ధానికి ప్రజలలో ఆదరణ కొరవడింది. సామాన్యులను ఆకట్టుకొనడానికి అప్పటికే సమాజంలో ఆచరణలో ఉన్న సిద్ధ తంత్రాల వినియోగం అధికమయ్యింది. మరో 200 సంవత్సరాల తరువాత ఈ సంప్రదాయాల మిళితం వజ్రయానం అనే సిద్ధాంతంగా రూపొందింది.[24] పరిసర దేశాలలో బౌద్ధం స్థిరంగా ఉన్నప్పటికీ భారతదేశంలో క్షీణించసాగింది. క్రమంగా సంపూర్ణంగా అంతరించింది.

దక్షిణ (థేరవాద) బౌద్ధం

[మార్చు]

థేరవాదం (పూర్వవాదం లేదా సనాతనవాదం) అనేది బౌద్ధంలో అన్నింటికంటే ప్రథమ దశలో ఆవిర్భవించిన సిద్ధాంతాలకు సమీపంలో ఉన్న సంప్రదాయం.[25] క్రీ.పూ.250లో జరిగిన మూడవ బౌద్ధ మండలి సమావేశంలో ఇతరులతో విభేదించిన స్థవిరులు (విభజ్జన వాదులు) క్రమంగా థేరవాదులయ్యారు. భారతదేశంలో ఈ వాదం క్షీణీంచినప్పటికీ శ్రీలంక, ఆగ్నేయ ఆసియాలలో ఇప్పటి బౌద్ధమతం థేరవాదుల మార్గానికి సమీపంగా ఉంది.

థేరవాదుల విశ్వాసాలు, ఆచరణలు ఆరంభంలో వెలువడిన పాళి సూత్రాలకు, వాటిపై వచ్చిన వ్యాఖ్యలకు పరిమితమై ఉంటాయి. కొన్ని శతాబ్దాలు మౌఖికంగా ఉండిపోయిన వీరి సూత్రాలు క్రీ.పూ.1వ శతాబ్దంలో శ్రీలంకలో గ్రంథస్తం చేయబడ్డాయి. ఆ సమావేశాన్నే థేరవాదులు "నాలుగవ బౌద్ధమండలి"గా భావిస్తారు. మౌలిక సూత్రాలైన సుత్త పిటకం, వినయపిటకం, త్రిరత్నాలు వంటి సిద్ధాంతాలకు థేరవాదులు సంకలనం చేసిన రచనలే ఆరంభదశలోని బౌద్ధ సిద్ధాంతాలకు అతి సమీప ఆధారాలుగా పండితులు భావిస్తారు.

థేరవాదులు విభజ్జన వాదము (విశ్లేషణా బోధన)ను సమర్ధిస్తారు. గ్రుడ్డి నమ్మకాలకు బదులు సాధకుల అనుభవం, విమర్శనాత్మక పరిశీలన, హేతువిచారణ ద్వారానే జ్ఞానం లభిస్తుందని థేరవాదుల సిద్ధాంతం. వీరి బోధనల ప్రకారం కామం, క్రోధం, మోహం వంటి మాలిన్యాలవలన సుఖలాలసత్వం, అందుమూలంగా దుఃఖం కలుగుతాయి. అష్టాంగమార్గ సాధన ద్వారా ఈ మాలిన్యాలను తొలగించి, మోహాన్నుండి బయటపడి దుఃఖాన్నుండి విముక్తులు కావచ్చును. అష్టాంగ మార్గం ద్వారా నాలుగు మహోన్నత సత్యాలు అవగతమౌతాయి. తద్వారా జ్ఞానము, నిర్వాణము లభిస్తాయి. నిర్వాణమే థేరవాదుల పరమార్ధం.

థేరవాదం ప్రస్తుతం ప్రధానంగా శ్రీలంక, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా దేశాలలోను, కొద్దిభాగం చైనా , బంగ్లాదేశ్, వియత్నాం, మలేషియాలలోను ఆచరణలో ఉంది. ఐరోపా, అమెరికా ఖండాలలో కూడా థేరవాదం పట్ల ఆకర్షణ పెరుగుతున్నది.

తూర్పు దేశాలలో మహాయాన బౌద్ధం

[మార్చు]
చైనా మింగ్ వంశపు కాలానికి చెందిన "గ్వానయిన్" (కరుణా దేవత) పింగాణీ ప్రతిమ
అమరావతి లోని బుద్ధుని విగ్రహం

మహాయానం అనే విభాగం సనాతన బౌద్ధ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను జోడించడం ద్వారా విస్తరించింది. మహాయానులు "బోధిసత్వ" భావానికి ప్రాముఖ్యత ఇస్తారు. సాధన ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందడం అనే ప్రాథమిక లక్ష్యం కంటే మహాయాన సాధకులు లోకంలో ఉండి అందరినీ దుఃఖాన్నుండి విముక్తులను చేయాడమనే లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. బోధిసత్వులు సకల జీవులకూ నిర్వాణాన్ని పొందడంలో తోడ్పడతారని వారి విశ్వాసం. అవధులు లేని "మహా కరుణ"యే బోధిసత్వుల లక్షణం. అదే అందరికీ నిర్వాణాన్ని ప్రసాదిస్తుంది.

శూన్యత, ప్రజ్ఞాపారమిత, తథాగతత్వము అనే ఉన్నత తత్వాలు మహాయానంలో తరచు ప్రస్తావించబడుతాయి. తథాగత గర్భ సూత్రాలు పరమ సత్యాన్ని, ధర్మాన్ని, ఇదే అన్నింటికంటే గొప్ప సత్యమనీ మహాయానుల విశ్వాసం. అయితే ప్రస్తుతం చైనాలో అన్ని సూత్రాలకు సమానమైన ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపిస్తుంది.[26]. మహాయాన సంప్రదాయంలో కొన్నిమార్లు బుద్ధుడు లేక ధర్మం ప్రత్యక్షం అవుతారని సూచనలున్నాయి. ఇది "దేవుడు" అనే భావానికి మహాయానంలో స్థానం కల్పిస్తుంది. మహాయానంలో త్రిపిటకాలకు అదనంగా మహాయాన సూత్రాలు, పద్మ సూత్రాలు, మహాపరినిర్వాణ సూత్రాలు ఉన్నాయి. వీటి సాధన ద్వారా బుద్ధత్వం పొందవచ్చునని వారి విశ్వాసం.

ప్రస్తుత కాలంలో చైనా, టిబెట్, జపాన్, కొరియా, సింగపూర్ దేశాలలోను, కొద్ది భాగం రష్యాలోను, వియత్నా అధిక భాగంలోను అనుసరించే బౌద్ధాన్ని స్థూలంగా క్రింది విభాగాలుగా విభజింపవచ్చును.

  • 'జెన్' లేదా 'చాన్' (Chan/Zen) - "ధ్యాన" అనే సంస్కృత పదం నుండి "చాన్" లేదా "జెన్" అనే చైనీయ పదాలు ఉద్భవించాయి. చైనా, జపాన్ దేశాలలో ఈ సంప్రదాయం బలంగా ఉంది. పేరును బట్టే జెన్ బౌద్ధంలో ధ్యానానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి జెన్ బౌద్ధులు శాస్త్రాల అధ్యయనానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అందరిలోనూ బుద్ధుడున్నాడు. ధ్యానం ద్వారా ఆ బుద్ధుని తెలిసికోవచ్చునని వీరి విశ్వాసం. ఇందులో మరిన్ని ఉపశాఖలున్నాయి. "రింజాయ్" జెన్ బౌద్ధులు తమ ధ్యానంలో "koan (meditative riddle or puzzle)" అనే సాధనాన్ని (యంత్రాన్ని) వాడుతారు. "సోటో" శాఖ జెన్ బౌద్ధులు కూడా ఈ యంత్రాన్ని వాడుతారు గాని "shikantaza అనగా కేవలం ఆసీనులై ధ్యానం చేయడం వారి ప్రధాన ఉద్దేశ్యం. ఈ జ్ఞానోదయం క్రమంగా అయ్యే విషయం కాదని, ధ్యానం ద్వారా మాయ తెరలు తొలగినపుడు ఒక్కమారుగా అత్మజ్ఞానం కలుగుతుందని సాధారణంగా జెన్ విశ్వాసాలు, ఆచరణా విధానాలు సూచిస్తాయి.[27]
  • శుద్ధ భూమి (Pure Land Buddhism) - అధికంగా చైనాలో సామాన్య జనం ఆదరించే విధానం[28] సాధన ద్వారా జ్ఞానం, నిర్వాణం సాధించే అవకాశం సామాన్యులకు కష్టం గనుక ఇతర విధానాల ద్వారా కూడ కొంత రక్షణ సాధ్యమని వీరి విశ్వాసం.[29] జెన్ బౌద్ధులు స్వీయ సాధనను విశ్వసిస్తే, శుద్ధభూమి బౌద్ధులు "అమిద బుద్ధుడు" తమను కాపాడి జ్ఞానం వైపు నడిపిస్తాడని నమ్ముతారు. ప్రార్థన, స్మరణం వంటి ప్రక్రియల ద్వారా అమితాభ బుద్ధుని "సుఖావతి" (సంతోష స్థానం) చేరుకోవచ్చునని వీరి విశ్వాసం. ఈ "స్వర్గ" సుఖమే నిర్వాణమని, లేదా నిర్వాణానికి ముందు ఘట్టమని (శాఖా భేదాలను బట్టి) నమ్ముతారు. సకల జీవులకూ సంసార బంధాలనుండి విముక్తి కలిగించడానికి కృత నిశ్చయుడైన అమితాభ బుద్ధుడు ఉన్నాడని, అచంచలమైన విశ్వాసం ఉంటే అది తప్పక సాధ్యమని వీరి భావం.
  • నిచిరెన్ జపాన్‌లో మాత్రమే (Nichiren Buddhism)
  • షింగన్ (ఒక విధమైన వజ్రయానం) (Shingon)
  • టెండాయ్ (Tendai)

ఉత్తర (టిబెటన్) బౌద్ధం

[మార్చు]
డ్రెపాంగ్‌లో యువ బుద్ధ భిక్షువులు

టిబెట్‌లో అనుసరిస్తున్న బౌద్ధం ప్రధానంగా మహాయానం అయినప్పటికీ అందులో వజ్రయానం ప్రభావం గణనీయంగా ఉంది. మహాయానం ప్రాథమిక నియమాలకు అదనంగా చాలా ఆధ్యాత్మిక, భౌతిక సాధనలు టిబెటన్ బౌద్ధంలో ప్రముఖమైన అంశాలు. సాధనకు అనుకూలమయ్యేలాగా శరీరం యొక్క, మనస్సు యొక్క శక్తులను పెంపొందించుకోవడం వల్ల సాధన త్వరగా సఫలమౌతుందని, ఒక్క జీవిత కాలంలోనే బుద్ధత్వము లభించే అవకాశం కూడా ఉన్నదని వారి విశ్వాసం. కనుక మహాయాన సిద్ధాంత శాస్త్ర్రాలే కాకుండా టిబెటన్ బౌద్ధులు వజ్ర యానానికి సంబంధించిన కొంత తంత్ర సాహిత్యాన్ని గుర్తిస్తారు. వీటిలో కొన్ని చైనా, జపాను దేశాలలోని పురాతన బౌద్ధ సాహిత్యంలో ఉన్నాయి. కొన్ని పాళీ రచనలలో కూడా కనిపిస్తాయి. టిబెటన్ మూలాలు కలిగిన భారతీయ చక్రవర్తి కనిష్కుడు కాష్ ఘర్, యార్ ఖండ్ మొదలైన మధ్య ఆసియా ప్రాంతాలు జయించి, అక్కడ మహాయాన బౌద్ధమతాన్ని ఆదరించారు. ఇతని ప్రయత్నాల ఫలంగా అక్కడ మహాయాన వేళ్ళూనుకుంది. సా.శ.7వ శతాబ్దంలో స్ట్రాంగ్ ట్సన్ గంపో అనే రాజు టిబెట్టును పరిపాలించే కాలంలో అతని భార్యయైన నేపాల్ రాజపుత్రిక తాంత్రిక బౌద్ధాన్ని టిబెట్‌లో ప్రవేశింపజేసింది. అతని మరో భార్యయైన చైనా రాజపుత్రిక పలువురు చైనా బౌద్ధభిక్షువులను రావించి వారికి వాసమేర్పాటుచేసింది. సా.శ.8వ శతాబ్దంలో మరో రాజు పద్మసంభవుడు, అతని శిష్యుడైన వైరోచనుడు మొదలైనవారిని రప్పించి వారి సహకారంతో టిబెటన్ లేదా టిబెటిక్ భాషలో సారస్వతం నిర్మింపజేశారు[30].

సమకాలీన బౌద్ధం

[మార్చు]
కొరియాలో ఒక బౌద్ధ మందిరంలో అంతర్భాగం

బౌద్ధానికి జన్మస్థానమైన భారతదేశంలో బౌద్ధం దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. పరిసర దేశాలలో బౌద్ధం బలంగా ఉన్నా గాని విచిత్రంగా ఆ ప్రభావం భారతదేశంలో బౌద్ధం పునరుద్ధరణకు దోహదం చేయలేదు. ఇటీవలి కాలంలో తిరిగి బౌద్ధం కొంత పరిమితమైన ఆదరణ పొందుతున్నది. ప్రపంచం మొత్తం మీద బౌద్ధుల సంఖ్య అంచనాలు 23 కోట్లు - 50 కోట్ల మధ్య ఉంటున్నది. బహుశా 35 కోట్లు అనే సంఖ్య వాస్తవానికి దగ్గరలో ఉండవచ్చును[31]. బౌద్ధ మతస్తుల సంఖ్య సరిగా అంచనా వేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.

  • "బౌద్ధులు" అనగా ఎవరనే విషయం స్పష్టంగా నిర్వచింపబడకపోవడం;
  • తూర్పు దేశాలలోని ఇతర మతాలు - టావో మతం, కన్‌ఫ్యూషియన్ మతం, షింటో మతం, మరి కొన్ని చైనా జానపద మతాలు కూడా గణనీయంగా బౌద్ధ మతము ఆచార సంప్రదాయాలను తమలో ఇముడ్చుకొన్నాయి;[32] [33] [34]
  • బౌద్ధులలో సామూహిక ప్రార్థనా సమావేశాలు, సామాజిక ఉత్సవాలు అంతగా లేనందున వారిని లెక్కించడం కష్టమవుతుంది[35];
  • చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటి దేశాలలో ఉన్న రాజకీయ పరిస్థితుల మూలంగా వ్యక్తుల మతాన్ని వ్యవస్థీకృత విధానంలో గుర్తించడంలేదు[36].[37]

ఒక అంచనా ప్రకారం క్రైస్తవ మతం, ఇస్లాం, హిందూమతం తరువాత ప్రపంచంలో నాలుగవ పెద్ద మతం బౌద్ధమతం.[38] బుద్ధుని కాలంలో ప్రాంభమైన భిక్షువుల సంఘము ప్రపంచంలోఅత్యంత పురాతనమైన సాంఘిక సమూహము. ప్రపంచంలో ఆచరణలో ఉన్న ముఖ్య బౌద్ధమత విభాగాలు ఇలా ఉన్నాయి.

  • పాళీ సూత్రాలపైన ఆధారపడిన థేరవాద బౌద్ధం - కంబోడియా, లావోస్, థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్‌లలో అధికంగా ఉంది. భారతదేశంలో బి.ఆర్. అంబేద్కర్ ఆరంభించిన దళిత బౌద్ధ ఉద్యమం కూడా ఈ విధానానికి సమీపంలో ఉంది.
  • చైనా భాషలో రచింపబడిన మహాయాన సూత్రాలను అనుసరించే తూర్పు ఆసియా దేశాలు - చైనా, జపాన్, కొరియా, తైవాన్, సింగపూర్, వియత్నాం.
  • టిబెటన్ భాషలోని సాహిత్యాన్ని, సంప్రదాయాలను అనుసరించే టిబెటన్ బౌద్ధం ఉన్న చోట్లు - టిబెట్, దాని పరిసర ప్రాంతాలు (భారత్, భూటాన్, మంగోలియా, నేపాల్, రష్యా)
  • పశ్చిమ దేశాలలో ఇటీవల కనిపిస్తున్న బౌద్ధ సమూహాలు ఈ తూర్పు దేశాలలోని మూడింటిలో ఏదో ఒక విధానాన్ని అనుసరిస్తారు.

సుమారుగా థేరవాదులు 12.4 కోట్లు, చైనా మహాయాన బౌద్ధులు 18.5 కోట్లు, టిబెటన్ మహాయాన బౌద్ధులు 2 కోట్లు ఉండవచ్చునని ఒక అంచనా.[39]తెరవాద బుద్ధిజానికి చెందిన త్రిపిటక పాళీ రచనలలో - చాతుర్వర్ణాలు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అనే వరుసక్రమంలో ఉంటాయి. బ్రాహ్మణ వర్ణానికి మొదటిస్థానం లేదు. ఈ నాలుగు వర్ణాలు అన్నీ పవిత్రమైనవేనని ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదని, అన్నీ సమానం అని చెప్పబడింది

బుద్ధుడు మానవులందరూ సమానం అని ప్రవచించి, కులవ్యవస్థలోని ఎక్కువతక్కువలను నిరసించాడు. ఒక వ్యక్తి జన్మ వలన కాక కమ్మ/కర్మ కారణంగా మాత్రమే బ్రాహ్మణుడు లేదా చండాలుడుగా నిర్ణయించబడుతున్నాడని అన్నాడు.

కొన్ని ముఖ్య సిద్ధాంతాలు

[మార్చు]

థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు.[40] అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం".

బుద్ధుని అనంతరం బౌద్ధాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది.[41]

బోధి

[మార్చు]
1వ శతాబ్దానికి చెందిన బుద్ధ ప్రతిమ - గాంధారం - ఉత్తర పాకిస్తాన్ (Guimet మ్యూజియం, పారిస్.

బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో "బోధి", "నిర్వాణం" అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం.

తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో "నిర్వాణం" అనే స్థితి "బుద్ధత్వం" కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు "బోధి" స్థితి లభిస్తుంది.[42] మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు.

బోధిత్వం పొందడానికి "నాలుగు ఆర్యసత్యాలను" సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువలన కర్మ నశిస్తుంది. బౌద్ధం ఆరంభ దశలో "పారమిత"ను ప్రస్తావించలేదు [43][44] అయితే తరువాత వచ్చిన థేరవాద, మహాయాన బౌద్ధ సాహిత్యంలో "పారమిత" సాధన కూడా అవసరం. బోధిత్వం పొదినవారు జనన, మరణ, పుర్జన్మ భూయిష్టమైన సంసార చక్రంనుండి విముక్తులవుతారు. మాయ తొలగిపోయినందువలన "అనాత్మత" అనే సత్యాన్ని తెలుసుకొంటారు.

మధ్యేమార్గం

[మార్చు]

బౌద్ధ మతం సంప్రదాయాలలోను, విశ్వాసాలలోను మధ్యేమార్గం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. శాక్యముని గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకొన్నాడని ప్రతీతి. "మధ్యేమార్గం" అన్న పదానికి వివిధ వివరణలు ఉన్నాయి

  1. కఠోరమైన దీక్షతో శరీరాన్ని మనస్సును కష్టపెట్టకుండా, అలాగని భోగ లాలసత్వంలో మునగకుండా మధ్య విధంగా సాధన, జీవితం సాగించడం.
  2. తత్వ చింతనలో చివరకు "ఇది ఉంది" లేదా "ఇది లేదు" అన్న పిడివాదనలకు పోకుండా మధ్యస్తంగా ఆలోచించడం[45]
  3. నిర్వాణంలో ఈ విధమైన ద్వివిధ, విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలుగడం.

త్రిరత్నాల శరణు

[మార్చు]
ధర్మ చక్రం, త్రిరత్నాల చిహ్నాలతో గౌతమ బుద్ధుని పాద ముద్ర - 1వ శతాబ్దం గాంధార శిల్పం

సంప్రదాయానుసారంగా త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాథమిక ప్రక్రియ. "బుద్ధుడు", "ధర్మము", సంఘము" అనేవే ఈ త్రిరత్నాలు. [46] దాదాపు బౌద్ధమతావలంబనలో ఇది మొదటి మెట్టుగా భావింపబడుతుంది. ఈ మూడింటికి అదనంగా "లామ" (దీక్ష) అనే నాల్గవ శరణు కూడా టిబెటన్ బౌద్ధంలో పాటించబడుతుంది.

బుద్ధుడు

జ్ఞానోదయమైన, ధర్మ మార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచరించడం.

ధర్మం

బుద్ధుడు తెలిపిన మార్గము. సత్యానికి, అసత్యానికి ఉన్న భేదము. పరమ సత్యము

సంఘం

బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణా మార్గంలో పురోగమిస్తున్నవారి సహవాసం. కొన్ని వివరణల ప్రకారం భౌక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘంలోని వారే.

"బుద్ధుడు" తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన "ధర్మము"ను ఆలంబనగా గైకొని స్వయంగా యుక్తాయుక్తాలు విచారించి, "సంఘము" సహకారంతో సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ సాధనలో అందుబాటులో ఉంచే సముదాయమే సంఘం.

మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు, ధర్మము, సంఘము అనే మూడు భావాలూ అవినాభావమైన శాశ్వతత్వానికి ప్రతీకలుగా భావించబడుతాయి. చాలా మంది బౌద్ధులు వేరే లోకంలో తమ కర్మలకు విముక్తి కలుగుతుందని విశ్వసించరు. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మలనుండి విమోచన కలుగుతుందని భావిస్తారు. కాని మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవణం, మననం వంటి సాధనల ద్వారా కర్మ బంధాలనుండి విముక్తి కలుగవచ్చునని ఉంది.

నాలుగు మహోన్నత సత్యాలు

[మార్చు]

బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి [47]

  1. దుఃఖం
  2. దుఃఖానికి కారణం
  3. దుఃఖంనుండి విముక్తి
  4. దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధిని మొదటి బోధనలు,[48] "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు. ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు. [49] థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు.[50] మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి.[51] దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.[52]

అష్టాంగ మార్గం

[మార్చు]
ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు

నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం. ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)

శీలం - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:

  1. "సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
  2. "సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట
  3. "సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం

సమాధి - మనసును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.

  1. "సమ్యక్ సాధన" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
  2. "సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
  3. "సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం

ప్రజ్ఞ - మనసును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.

  1. "సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
  2. "సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు

ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు. సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన. నిర్వాణం చేర్చే బౌద్ధ మార్గం. ఇందులో ఎనిమిది అంశాలు ఉన్నాయి. బుద్ధుడు చేసిన తొలి ఉపదేశాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధం. గౌతముడు జ్ఞానిగా పరిణామం చెంది, సారనాధ్‌ చేరి, అక్కడ పూర్వం తనతో తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజకులకు మొదటి సారిగా చేసిన ధర్మబోధలో ఇది భాగం. 1. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి), 2. సమ్మా సంకప్ప (సమ్యక్‌ సంకల్పం), 3. సమ్మా వాచా (సమ్యక్‌ వాక్కు), 4. సమ్మా కమ్మంత (సమ్యక్‌ కర్మ), 5. సమ్మా ఆజీవ (సమ్యక్‌ ఆజీవిక), 6. సమ్మా వాయామ (సమ్యక్‌ కృషి), 7. సమ్మా సతి (సమ్యక్‌ స్మృతి), 8. సమ్మా సమాధి (సమ్యక్‌ సమాధి). ఈ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం అత్యున్నత స్థితిని (నిర్వాణాన్ని) పొందడానికి ఉపయోగపడేది. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి). బాధలకు, వాటి నివారణకు సంబంధించిన పరమ సత్యాలను తెలుసు కొన లేకపోవడం అవిద్య. దానిని నిర్మూలించడం సమ్యక్‌ దృష్టి. మిచ్ఛా దిట్ఠి (మిధ్యా దృష్టి) కానిది సమ్మ దిట్ఠి. అంటే నాలుగు ఆర్య సత్యాల జ్ఞానం సంపాదించి ఉండటం. సమ్యక్‌ సంకల్పం అంటే సదాశయాలను కలిగి ఉండటం, సదాలోచనలు చేయడం. వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల ఇంద్రియ సుఖాల పట్ల విముఖత, ఎవరికీ హాని చేయకూడదనే వైఖరి, ద్వేష భావాన్ని తొలగించుకోవడం మొదలైన మంచి ఆలోచనలు కలగడం. సమ్యక్‌ వాక్కు అంటే సత్యం పలకడం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడక పోవడం, దయతో, మర్యాద పూర్వకంగా మాట్లాడటం. సమ్యక్‌ కర్మ అంటే సాటివారి మనోభావాల పట్ల, హక్కుల పట్ల గౌరవంతో ప్రవర్తించడం. జీవ హింస చేయకపోవడం మొదలైనవి కూడా ఇందులో చేరతాయి. సమ్యక్‌ జీవనం అంటే ఏ జీవికీ హాని కలిగించని వృత్తిని ఏదైనా జీవిక కోసం చేయడం. సమ్యక్‌ కృషి అంటే అవిద్యను తొలగించడానికి తొలి అడుగులు వేయడం. సమ్యక్‌ కృషికి నాలుగు ప్రయోజనాలను బుద్ధుడు చెప్పాడు. అవి: అష్టాంగమార్గానికి విరుద్ధమైన మానసికి స్థితులు కలగకుండా చూసుకోవడం. అలాంటి మానసిక స్థితులు ఇదివరకే ఏర్పడి ఉంటే వాటిని తొలగించు కోవడం. అష్టాంగ మార్గానికి ఏవి అవసరమో అట్టి మానసిక స్థితులు కలిగేలా చూడటం. ఇప్పటికే అట్టి మానసిక స్థితులు కలగి ఉంటే అవి మరింత వృద్ధి పొందడానికి దోహదం చేయడం. చెడ్డ భావనలు పెడదోవ పట్టించకుండా నిరంతరం మనస్సును జాగరితం చేసి ఉంచడం సమ్యక్‌ స్మృతి. అంటే శరీరాన్నీ, మనస్సునూ నిరంతరం జాగ్రతగా గమనిస్తూ, దుఃఖం కలిగించే పరిస్థితులు రాకుండా చూడటం. సమ్యక్‌ సమాధి అంటే ఏకాగ్రతను మించిన సమాధి స్థితి. సమాధిలో కేవలం మనస్సు ఏకాగ్ర స్థితిని చేరడమే జరుగుతుంది. దురాశ, ద్వేషం, అచేతనంగా, మందంగా ఉండటం, సందేహించడం, ఎటూ తేల్చుకొనలేకపోవడం అనే ఐదు సంకెళ్లను తెంచుకొని సరైన మార్గంలో నడచుకోవడం సమ్యక్‌ సమాధి. ధ్యానం చేసే సమయంలో ఈ సంకెళ్లు బాధించకపోవచ్చునుగానీ, ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన తరువాత తిరిగి ఇవే మానసిక సంకెళ్లు పురోగమనానికి అడ్డం వస్తాయి. దుర్గుణాల నుంచి విముక్తుడు కావడం కూడా సమ్యక్‌ సమాధి సాధించే ఒక ప్రయోజనం.[53] 10

తాత్విక భావాలు

[మార్చు]

పాళీ భాషలోని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కొన్ని తాత్విక సందేహాలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచం శాశ్వతమా, అశాశ్వతమా? ఆత్మ, శరీరం వేరు వేరా లేక ఒకటేనా? నిర్వాణం లేదా మరణం తరువాత ఉనికి ఉంటుందా? - ఇటువంటి ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం జీవితంలో పనికివచ్చే జ్ఞానానికి అటువంటి అతివాద ప్రశ్నలు అడ్డుగా నిలుస్తాయన్న భావన - అని ఒక అభిప్రాయం.[54]. అంతే కాకుండా అటువంటి ప్రశ్నలు ప్రపంచం, ఆత్మ, వ్యక్తి అనే భావాలకు లేని వాస్తవాన్ని అంటగడతాయని కూడా కొందరంటారు.

పాళీ సూత్రాలలోనూ, చాలా మహాయాన, తాంత్రిక బౌద్ధ సూత్రాలలోనూ బుద్ధుడు ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది - వాస్తవం (సత్యం) సామాన్యమైన మనసుకు, వాదానికి అతీతమైనది. ప్రాపంచిక దృష్టితో సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం. "ప్రజ్ఞా పారమిత" సూత్రాలలో ఇది ఒక ప్రాథమిక అంశం. పఠనం, సాధన, ధ్యానం, విశ్వాసం, సూత్రాలపట్ల గౌరవం వంటి సాధనాల ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమమౌతుంది. నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే.

"మహాపరినిర్వాణ సూత్రం" లేదా "ఉత్తర తంత్రం" అనబడే మహాయానసూత్రం ప్రకారం ధర్మాన్ని గురించిన వివేచన అవుసరమే కాని వాదాలు, శాస్త్రాల పట్ల అతిగా ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమైన జ్ఞానానికీ, వీటికీ సంబంధం లేదు. ఇదే భావం చాలా తంత్రాలలోను, సిద్ధాంతాలలోను చెప్పబడింది.[55] మహాసిద్ధ తిలోపుడనే భారతీయ బౌద్ధ యోగి కూడా వాదాలను నిరసించాడు. వివిధ శాఖలలో భేదాలున్నాగాని అధికంగా బౌద్ధులు విశ్వసించే ప్రకారం పరమ లక్ష్యం (నిర్వాణం లేదా ముక్తి లేదా బోధి) అనేది మాటలకు అతీతమైనది అని.

ధర్మ గ్రంధాలు

[మార్చు]

బౌద్ధమతం గ్రంథాలు అనేకాలు ఉన్నాయి. వీటిని అధ్యయన గ్రంథాలుగాను, కొందరు పూజార్హాలుగానూ కూడా చూస్తారు. ప్రధానంగా బౌద్ధ సూత్రాలు సంస్కృతంలో త్రిపిటకాలు (పాళీ భాషలో "తిపిటక") - అనగా మూడు బుట్టలు. అవి

  • వినయ పీఠకం - బౌద్ధ సంఘం, భిక్షువులు, భిక్షుణిల నియమాలు, విధానాలు గురించినది, అందుకు సంబంధించిన శాస్త్రాధారాలు, వివరణలు.
  • సుత్త పీఠకం - గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినవని చెప్పబడే సూత్రాలు
  • అభిధమ్మ పీఠకం - గౌతమ బుద్ధుని బోధనలను విపులీకరించే సూత్రాలు

గ్రంథాలలో ఉన్న ప్రకారం గౌతమబుద్ధుని పరినిర్వాణానంతరం కొలది కాలానికే మొదటి బౌద్ధ మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశానికి మహాకాశ్యపుడు అనే బౌద్ధ భిక్షువు సభాధిపత్యం నిర్వహించాడు. ఈ మండలి లక్ష్యాలు - బుద్ధుని బోధనలను మననం చేయడం (సూత్రాలు లేదా సుత్త), సంఘాలలో పాటించవలసిన నియమాలను క్రమబద్ధం చేయడం (వినయం). గౌతమ బుద్ధుని సహచరుడు అయిన ఆనందుడు చెప్పిన విషయాలు సుత్త పిటకం అయ్యాయి. అభిధమ్మ, ఉపాలి అనే శిష్యులు చెప్పిన విషయాలు వినయ పిటకం, అభిధమ్మ పిటకం అయ్యాయి. ఈ పిటకాలు కొంతకాలం మౌఖికంగా ఇతరులకు సంక్రమించాయి. మరి కొంత కాలం తరువాత గాని గ్రంథస్తం కాలేదు. ఈ పిటకాలలో బుద్ధుని బోధనలు, జీవితంలో ఘటనలు, వేదాంత, శాస్త్ర సంవాదనలు, ఇతర నియమాలు అనేకం ఉన్నాయి.

థేరవాదులు, మరికొంత మంది ఆరంభ కాలపు బౌద్ధులు పాళీభాషలోని తమ గ్రంథాలు స్వయంగా బుద్ధుడు బోధించిన విషయాల సంగ్రహమేనని విశ్వసిస్తారు. థేరవాద సూత్ర గ్రంథాలలో సుమారు 40 లక్షల పదాలున్నాయి. "మహాయాన సూత్రాలు" వంటి ఇతర సూత్రాలు కూడా స్వయంగా బుద్ధుడే బోధించాడని, కాని అవి రహస్యంగా చెప్పబడడం వల్ల సామాన్యులకు తెలియలేదని ఆయా వాదులు విశ్వసిస్తారు. నాగులు, లేదా బోధిసత్వుల ద్వారా ఆ రహస్యాలు తరువాత అందుబాటులోకి వచ్చాయని వారి నమ్మకం. సుమారు 600 మహాయాన సూత్రాలు సంస్కృతం లేదా చైనా లేదా టిబెటన్ భాషలో ఇప్పుడు లభిస్తున్నాయి. మహాయాన సూత్రాలను థేరవాదులు విశ్వసించరు.

తెలుగునాట బౌద్ధం

[మార్చు]
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము

బౌద్ధమతం ఆరంభ దశనుండి ఆంధ్ర ప్రదేశ ప్రాంతలో విశేషమయన ఆదరణ పొందింది. అశోకునికి ముందే, అనగా బుద్ధుని కాలం నుండే ఆంధ్రదేశంలో బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉన్నదని పెక్కు ఆధారాల వల్ల తెలియవస్తుంది. అశోకుని శిలాశాసనం ప్రకారం ఆంధ్ర దేశం అప్పటికే "ధర్మవిషయం"లో ఉంది. గుంటుపల్లి, భట్టిప్రోలు వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. (క్రీ.పూ. 300 నాటివి.) విశేషించి భట్టిప్రోలును బుద్ధుడే స్వయంగా సందర్శించాడని ఒక అభిప్రాయం ఉంది. భట్టిప్రోలులోని ధాతు కరండం బుద్ధుని శరీర ధాతువులకు చెందినది కావచ్చును. అశోకుని కాలంలోను, తరువాత శాతవాహనుల కాలంలోను బౌద్ధాన్ని రాజకుటుంబాలు విశేషంగా ఆదరించారు. రాజుల హిందూమతావలంబులైనా గాని రాణివాసం బౌద్ధ సంఘాలకు పెద్దయెత్తున దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. ఉత్తర హిందూస్తానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకలలో వేంగిదేశం ముఖ్యమైన మార్గం, కూడలిగా ఉండేది. తరువాత మహాయానం ఆంధ్రదేశంలోని నాగార్జునుని తత్వంతో ప్రావర్భవించింది. ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్ననాటి చిహ్నాలు.

గౌతమ బుద్ధుడు స్వయంగా ధాన్యకటకం (అమరావతి) వద్ద కాలచక్రతంత్రం ప్రవర్తింప చేశాడని, ధారణులను నిక్షిప్తం చేశాడని, అందువల్ల అమరావతి ధరణికోట అయ్యిందని జర్మన్ పండితుడు ‘హాలెంట్ హోప్‌మాన్’ తన పరిశోధనలో వెల్లడించాడు. అమరావతి స్థూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు ‘మంజుశ్రీ మూలకల్పం’ బౌద్ధ గ్రంథం పేర్కొంది.

ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన భట్టిప్రోలు స్థూపంలో భట్టిప్రోలు శాసనం ప్రకారం ‘బుద్ధ శరీరాన్ని నిక్షిప్తం’ అని రాశారు. ఈ శాసనంలోనే కుబేరక అనే రాజు ప్రస్తావన ఉంది. ఆంధ్ర దేశంలో సుమారు వంద బౌద్ధ స్థలాలను పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు.

భట్టిప్రోలు, అమరాపతి, నాగార్జునకొండ, ఘంటశాల, జగ్గయ్యపేట, ఆదుర్రు, శాలిహుండం, ఫణిగిరి, చందవరం, రామతీర్థం, శంకరం, కోటిలింగాల, కొండాపూర్, పెదగంజాం, చినగంజాం మొదలైన ప్రాంతాల్లో స్థూపాలు, చైత్యగృహాలు, విహారాలు బయల్పడ్డాయి. అశోకుడి శిలా శాసనాలు ఆంధ్ర దేశంలో కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజులమందగిరిల్లో లభించాయి. ఇటీవల విశాఖపట్నం జిల్లా బావికొండ దగ్గర బుద్ధుడి పవిత్ర ధాతువులు లభించాయి. కరీంనగర్ జిల్లా ధూళకట్టలో స్థూపం బయటపడింది. శ్రీకాకుళంలో వంశధార నది ఒడ్డున శ్రీముఖలింగ శైవ క్షేత్రం ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో సా.శ. 8, 9 శతాబ్దాల నాటి అమితాబ, అక్షోభ్య (బుద్ధుడు), ఉపనీహవిషయ (స్త్రీ) మూర్తులు బయల్పడ్డాయి. ఇవి బౌద్ధమతానికి చెందినవి. నల్కొండ జిల్లా ఫణిగిరిలో గాజులబండ, తిరుమలగిరి ప్రాంతాల్లో బౌద్ధ అవశేషాలు లభ్యమయ్యాయి.

ఉడ్డియానదేశం

[మార్చు]

ఉడ్డియాన మనే ప్రాంతమొకటి భారతదేశం లో ఉండేది. ఫాహీక్ యాత్రికుడు ఇచట 500 సంఘారామములు ఉన్నవని, ఇవిహీనయానానికి చెందినవని, బుద్ధధర్మమిచట గౌరవించబడేదని చెప్పినాడు. 6వ శతాబ్దములో మనదేశానికి వచ్చిన సుంగ్ అయాత్రికులకు ఉడ్డియాన దేశపురాజు గౌరవపూర్వకమైన స్వాగతిమిచ్చాడట. ఈరాజు శాకాహారియని, ఈయన ప్రతిదినము బుద్ధుని పూజించెడివాడని వీరన్నారు. ఈ ఉడ్డియానములో 70 భిక్షువులు గల బౌద్ధ చైత్యమొకటి, 300 భిక్షువులు గల స్వర్ణశకలాలతో నిండిన మరొక చైత్యము, 200 భిక్షువులున్న వేరొక మహాచైత్యము ఉండెడిదని, ఈభిక్షువులు నియమబద్దమైన జీవితమును నడుపుతూ ఉన్నారని కూడా ఈయాత్రికులు పల్కినారు.[56]

చిహ్నాలు

[మార్చు]

మహాయాన బౌద్ధం, వజ్రాయన బౌద్ధంలో ఎనిమిది శుభసూచకమైన చిహ్నాలున్నాయి.

  • ఛత్రము (గొడుగు గుర్తు)
  • బంగారు చేప
  • పద్మము
  • శంఖము
  • ధ్వజం
  • ధర్మ చక్రం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Major Religions Ranked by Size". Archived from the original on 2011-04-22. Retrieved 2008-06-09.
  2. http://www.infoplease.com/ipa/A0001470.html
  3. Dhamma
  4. For instance, see the UNESCO webpage entitled, "Lumbini, the Birthplace of the Lord Buddha". See also Gethin Foundations, p. 19, which states that in the mid-third century BCE the Emperor Ashoka determined that Lumbini was the Buddha's birthplace and thus installed a pillar there with the inscription: "... this is where the Buddha, sage of the Śākyas, was born."
  5. For instance, Gethin Foundations, p. 14, states: "The earliest Buddhist sources state that the future Buddha was born Siddhārtha Gautama (Pali Siddhattha Gotama), the son of a local chieftain—a rājan—in Kapilavastu (Pali Kapilavatthu) what is now the Indian-Nepalese border." However, Professor Gombrich (Theravada Buddhism, p. 1) and the old but specialized study by Edward Thomas, The Life of the Buddha, ascribe the name Siddhattha/Siddhartha to later sources
  6. http://buddhism.about.com/library/blbudlifesights2.htm Archived 2007-11-15 at the Wayback Machine The Life of the Buddha: The Four Sights "On the first visit he encountered an old man. On the next excursion he encountered a sick man. On his third excursion, he encountered a corpse being carried to cremation. Such sights brought home to him the prevalence of suffering in the world and that he too was subject to old age, sickness and death...on his fourth excursion, however, he encountered a holy man or sadhu, apparently content and at peace with the world."
  7. http://www.wildmind.org/mantras/figures/shakyamuni/5 Wild mind Buddhist Meditation, The Buddha’s biography: Spiritual Quest and Awakening
  8. see: https://web.archive.org/web/20040629075505/http://www.angelfire.com/electronic/bodhidharma/bodhi_tree.html The Bodhi Tree
  9. http://www.buddhamind.info/leftside/arty/bod-leaf.htm Archived 2008-05-26 at the Wayback Machine Bodhi leaf
  10. Skilton, Concise, p. 25
  11. Cousins, Dating.
  12. "the reputed place of Buddha's death and cremation,"Encyclopedia Britannica, Kusinagara
  13. A History of Indian Buddhism - Hirakawa Akira (translated and edited by Paul Groner) - Motilal Banarsidass Publishers, Delhi, 1993, p. 7
  14. Indian Buddhism, Japan, 1980, reprinted Motilal Banarsidass,Delhi,1987,1989,table of contents
  15. Dr Gregory Schopen - Professor of Sanskrit, Tibetan, and Buddhist Studies at the University of Texas at Austin. His main views and arguments can be found in his book Bones, Stones, and Buddhist Monks, University of Hawai'i Press
  16. Mitchell, Buddhism, Oxford University Press, 2002, page 34 & table of contents
  17. Skorupski, Buddhist Forum, vol I, Heritage, Delhi/SOAS, London, 1990, page 5; Journal of the International Association of Buddhist Studies, vol 21 (1998), part 1, pages 4, 11
  18. Encyclopedia of Religion, Macmillan, New York, sv Councils, Buddhist
  19. Journal of the Plai Text Society, volume XVI, p. 105)
  20. Janice J. Nattier and Charles S. Prebish, 1977. Mahāsāṅghika Origins: the beginnings of Buddhist sectarianism in History of Religions, Vol. 16, pp. 237–272
  21. Harvey, Introduction to Buddhism, p. 74
  22. Williams, Paul (1989). Mahayana Buddhism: the doctrinal foundations. London: Routledge., pages 20f
  23. Lamotte, Étienne (trans. to French) (1976). Teaching of Vimalakirti. trans. Sara Boin. London: Pali Text Society. pp. XCIII. ISBN 0710085400.
  24. Davidson, Ronald M. (2003). Indian Esoteric Buddhism: A Social History of the Tantric Movement. New York: Columbia University Press. ISBN 0231126190.
  25. Gethin, Foundations, page 1
  26. Welch, Practice of Chinese Buddhism, Harvard, 1967, page 395
  27. Harvey, Introduction, pages 165f
  28. Harvey, Introduction to Buddhism, page 152
  29. Routledge Encyclopedia of Buddhism, 2007, page 611
  30. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 9 December 2014.
  31. Adherents.com (2005). "Major Religions of the World
    Ranked by Number of Adherents"
    . Archived from the original on 2011-04-22. Retrieved 2008-05-19.
  32. "Chinese Cultural Studies: The Spirits of Chinese Religion". Archived from the original on 2011-12-03. Retrieved 2008-06-09.
  33. "Windows on Asia - Chinese Religions". Archived from the original on 2009-02-20. Retrieved 2008-06-09.
  34. "BUDDHISM AND ITS SPREAD ALONG THE SILK ROAD". Archived from the original on 2011-12-13. Retrieved 2008-06-09.
  35. U.S. Department of States - International Religious Freedom Report 2006: China (includes Tibet, Hong Kong, and Macau)
  36. "[[openDemocracy.net]] - 'The Atlas of Religion,' Joanne O'Brien & Martin Palmer: State Attitudes to Religion" (PDF). Archived from the original (PDF) on 2009-06-26. Retrieved 2008-06-09.
  37. "The Range of Religious Freedom". Archived from the original on 2011-12-07. Retrieved 2008-06-09.
  38. Garfinkel, Perry (December 2005). "Buddha Rising". National Geographic: 88–109.
  39. [1][permanent dead link], retrieved on 2008-01-15
  40. See for example: http://www.thebigview.com/buddhism/fourtruths.html Archived 2009-11-11 at the Wayback Machine The Four Noble Truths
  41. Gombrich, Richard F. (1988). Theravada Buddhism (2nd ed.). London: Routledge & Kegan Paul. pp. 2. ISBN 0710213190.
  42. An important development in the Mahayana [was] that it came to separate nirvana from bodhi ('awakening' to the truth, Enlightenment), and to put a lower value on the former (Gombrich, 1992d). Originally nirvana and bodhi refer to the same thing; they merely use different metaphors for the experience. But the Mahayana tradition separated them and considered that nirvana referred only to the extinction of craving (= passion and hatred), with the resultant escape from the cycle of rebirth. This interpretation ignores the third fire, delusion: the extinction of delusion is of course in the early texts identical with what can be positively expressed as gnosis, Enlightenment.’’ How Buddhism Began, Richard F. Gombrich, Munshiram Manoharlal, 1997, p. 67
  43. ‘It is evident that the Hinayanists, either to popularize their religion or to interest the laity more in it, incorporated in their doctrines the conception of Bodhisattva and the practice of paramitas. This was effected by the production of new literature: the Jatakas and Avadanas.' Buddhist Sects in India, Nalinaksha Dutt, Motilal Banararsidass Publishers (Delhi), 2nd Edition, 1978, p. 251. The term 'Semi-Mahayana' occurs here as a subtitle
  44. ‘[the Theravadins’] early literature did not refer to the paramitas.’ Buddhist Sects in India, Nalinaksha Dutt, Motilal Banararsidass Publishers (Delhi), 2nd Edition, 1978, Dutt, p. 228
  45. Kohn, Shambhala, pp. 131, 143
  46. Bhikku, Thanissaro (2001). "Refuge". An Introduction to the Buddha, Dhamma, & Sangha. Access to Insight.
  47. Macmillan Encyclopedia of Buddhism (2004) Volume One, page 296
  48. Thera, Piyadassi (1999). "Dhammacakkappavattana Sutta". The Book of Protection. Buddhist Publication Society. In the Buddha's first sermon, the Dhammacakkappavattana Sutta, he talks about the Middle Way, the Noble Eightfold Path and the Four Noble Truths.
  49. Harvey, Introduction, p. 47
  50. Hinnels, John R. (1998). The New Penguin Handbook of Living Religions. London: Penguin Books. ISBN 0140514805.,pages 393f
  51. Harvey, Introduction to Buddhism, p. 92
  52. Eliot, Japanese Budhism, Edward Arnold, London, 1935, page 60
  53. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 20
  54. MN 72 (Thanissaro, 1997) Archived 2015-02-06 at the Wayback Machine
  55. The Sovereign All-Creating Mind tr. by E.K. Neumaier-Dargyay, pp. 111–112.
  56. 1956న భారతి మాస పత్రిక: వ్యాసము ఉడ్డియానదేశము - రచన : శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి

ఉపయుక్త గ్రంథసూచి

[మార్చు]
  1. [2]
  2. ధమ్మపదము-బుద్ధగీత-చర్ల గణపతిశాస్త్రి

బయటి లింకులు

[మార్చు]