విరూపాక్ష దేవాలయం, హంపి
విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది.[1] ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 km దూరంలో ఉంది. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగం. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడింది. విరూపాక్ష అనగా శివుని రూపం.
విరూపాక్ష దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 15°20′08″N 76°27′36″E / 15.3354651°N 76.4599836°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | కర్ణాటక |
జిల్లా: | బెల్లరీ |
ప్రదేశం: | హంపి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివుడు ) |
ఉత్సవ దైవం: | శివుడు |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 7వ శతాబ్దం [ఆధారం చూపాలి] |
సృష్టికర్త: | చాళుక్యులు |
చరిత్ర
మార్చుహంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం[2] నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా.[3] చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు.[4] విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.[5] విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు.విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్దం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కు, తూర్పు, ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది.[6]
ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.[7]
తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది.[8] ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి.[9] విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.[10]
1520 వ సంవత్సరంలనాటి ఆలయ విశేషాలు
మార్చుఈ ఆలయం చాల పురాతనమైనందున, దీనిని వీరు చాల పవిత్రంగా భావించేవారు యాత్రికులు ఎక్కువగా వస్తూ ఉండేవారు. ఈ ఆలయ ప్రధాన ద్వారం పైన అందమైన చెట్టు ఉంది.చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో ఉండేది. ఈ ద్వారం పై అతి ఎత్తైన గోపురం ఉంది. అందులో మనుషుల ఆడ, మగ చిత్రాలు ఉన్నాయి. ఈ గోపురం క్రింద నుండి పైకి పోను పోను సన్నగా ఉంది. ద్వారం లోనుండి లోపలికి వెళ్ళగానే, విశాలమైన ఆవరణ ఉండగా అందులో మరొక ప్రవేశ ద్వారం ఉంది. ఇది మొదటి దాని లాగే ఉన్నది కాని చిన్నది. దీని లోపలికి వెళ్ళ గానే మరొక అవరణ ఉంది. అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టు స్తంభాలతో ఉంది. దీనికి మధ్యలో గర్భ గుడి ఉంది. ఈ గర్భ గుడి ముందు నాలుగు స్తంభాలున్నాయి. అందులో రెండు బంగారు పూతతోను, రెండు రాగి రేకు తాపడం తోను ఉన్నాయి. ఈ గుడి చాల పురాతనమైనది. అందువల స్తంభాలపై నున్న బంగారు పూత కొంత వెలిసి పోయి లోపలున్న రాగి రేకు కనిపిస్తున్నది. అంటే ఆ నాలుగు స్తంభాలు రాగివే నన్న మాట. దేవుని కెదురుగా ఉన్న స్తంభాలను ప్రస్తుతం రాజ్య మేలుతున్న రాజు శ్రీకృష్ణ దేవ రాయలు ఇవ్వగా, మిగతావి అతని పూర్వీకులు ఇచ్చారు. ద్వారానికి ముందు పై కప్పు వరకు, రాగితో తాపడం చేయబడి ఉంది. పైకప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు,చిత్రించ బడి ఉన్నాయి. విగ్రహం ముందున్న స్తంభాలలో రంద్రాలున్నాయి. వాటిలో రాత్రులందు నూనె దీపాలు పెడతారు. దీని తర్వాత ఒక చిన్న భూగర్భ గది లాగ ఒకటున్నది. అందులో ఒక విగ్రహం నిలబడి ఉంది. దీనికన్న ముందు మూడు తలుపులున్నాయి. ఇదంతా చీకటిగా ఉంది. ఇక్కడ ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న ద్వారపాలకులు పూజారిని తప్ప వేరెవ్వరిని లోనికి వెళ్లనివ్వరు. నేను వారికి కొంత ధనమిచ్చి నందున వారు నన్ను లోపలికి పోనిచ్చారు. ఈ రెండు ద్వారాల మధ్య రెండు చిన్న విగ్రహాలున్నాయి. ఇందులోని ప్రధాన విగ్రహం ఏ అకారము లేని గుండ్రటి రాయి మాత్రమే. దీనికి వీరు చాల భక్తితో పూజ చేస్తారు. ఈ ఆలయం వెలుపలి భాగమంతా రాగితో తాపడం చేయబడి ఉంది. గుడి వెనక వైపున వరండాకు దగ్గిరగా తెల్లని చలువ రాతి విగ్రహం ఉంది. దానికి ఆరు చేతులు ఉన్నాయి. ఒక చేతిలో, ఇంకో చేతిలో కత్తి మిగతా చేతులలో ఏవో పవిత్రమైన వస్తువులు ఉన్నాయి. దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకొక వింత జంతువు ఉన్నాయి. ఈ వింత జంతువు బర్రెను చంపడానికి సహాయం చేస్తున్నట్లున్నది. గుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగుతుంటాయి. ఈ చుట్టు ప్రక్కల ఇతర చిన్న ఆలయాలున్నాయి. ఇవి కూడా అన్ని ఆలయాల లాగే ఉన్నాయి కాని ఇది ప్రధానమైనది, పురాతన మైనది.
ఈ ఆలయాలకు చాల భూములు, తోటలు ఉన్నాయి. వాటిలో బ్రాహ్మణులు, తాము ఆ పొలాలలో తినడానికి కూరగాయలు, ఇతర పంటలు పండించు కుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాలలో చక్రాలున్న రథాన్ని గుడి ముందున్న వీధిలో లాగుతారు. ఇటువంటి ఉత్సవ సందర్భం నేను ఈ నగరంలో ఉండగా రాలేదు కనుక నేను చూడలేక పోయాను. ఈ నగరంలో ఇంకా చాల ముఖ్యమైన ఆలయాలున్నాయి. వాటినన్నింటి గురించి వ్రాయాలంటే చాల ఎక్కువ అవుతుంది." అన్నాడు.
ప్రస్తుత విరూపాక్షాలయం
మార్చుతూర్పు ముఖంగా ఉన్న ఈ విరూపాక్షాలయం ప్రధాన రాజ గోపురం పదకొండంతస్తులు కలిగి చాలా ఎత్తుగా ఉంది. ఈ ఆలయం విజయ నగర నిర్మాణాని కన్న ముందే నిర్మితమైనది. రాజగోపురము పై స్త్రీ పురుషుల, జంతువుల, శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురం ద్వారం లోపల ఒక ప్రక్క ఒక చిన్న నంది, ఇంకొక ప్రక్క మూడు తలల నంది ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆవరణ ఉంది. ఇక్కడే ఆలయ కార్యాలయం, ప్రక్కన యాత్రికులకు విశ్రాంతి గదులు ఉన్నాయి. ఆవరణ మధ్యలో ఒక నీటి కాలువ ఉంది. ఇది ఆ ప్రక్కనున్న హేమ కూటము నుండి ప్రవహిస్తున్నది. ఇందులో ఎల్ల వేళలలో నీరుండును. ఆవరణ లోపల ఫొటోలు తీయదలిస్తే మామూలు కెమెరాకి 50 రూపాయలు, వీడియో కెమెరాకి 500, రూపాయలు కట్టాలి. ఈ ఆవరణకు ఎదురుగా మరో గోపురమున్నది.
ఈ రెండో గోపురం మొదటి దానికన్న చిన్నది. దీనిని శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించి నందున దీనికి రాయల గోపురం అని పేరు. ఈ గోపుర ద్వారంలో ఒక శిలా శాసనం పలక ఉంది. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణ. ఇందులో మధ్యన ముఖ మంటపం, దాని తర్వాత గర్భ గుడి ఉన్నాయి. గర్భ గుడి చుట్టు ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వేంకటేశ్వర, మహిషాసుర మర్దని వంటి దేవతా మూర్తులు ఉన్నాయి. విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడా ఉంది. పూర్వం పంపానదిగా పిలువ బడినదే ఈ నాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణలో దీప స్తంభం, ధ్వజ స్తంభం, నాలుగు కాళ్ల మంటపం, ఆ మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు నందులు ఉన్నాయి. తర్వాత ముఖ మంటపం ఉంది. ముఖ మంటపం లోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉంది. ముఖ మంటపం అనేక స్తంభాలతో, వాటి పై సుందర శిల్పాలతో ఉంది. పై కప్పుకు సున్నంతో తాపడం చేసి అందు రంగులతో పులి లాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. కాలగమనంలో చిత్రాలు చాల వరకు వెలసి పోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. వీటి గురించే ఆ నాడు డొమింగో పీస్ చెప్పినది. ముఖ మండపంలోనుండి గర్భగుడి లోనికి దారి లేదు. ఉగ్ర రూపుడైన స్వామి వారికి ఎదురుగా వెళ్ల కూడదనే నియమాన్ని అనుసరించి, స్వామి దర్శనానికి భక్తులు వెళ్లడానికి గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారి ఉంది. గర్భలయానికి ఇరువైపులా రెండు సొరుగులు ఉన్నాయి. అందులో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. గర్భాలయం ముందు నాలుగు అందమైన నల్ల రాతి స్తంభాలతో మండపం ఉంది. ఈ స్తంభాలలో మనోహరమైన శిల్పకళ ఉంది. వీటిని గురించే ఆనాడు "డొమింగో పీస్" చెప్పినది. అందులో స్వామి వారి వాహనాలైన గుర్రం, నెమలి, ఏనుగు వంటి వాహనాలు ఉన్నాయి. గర్భ గుడికి కుడి ప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్ర పటం ఉంది. అసలు కిరీటాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు చేయించాడు. ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్ర పరచ బడి ఉంది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింప జేస్తారు.
గర్భాబాలయానికి వెనుక, బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉంది. అక్కడ పది మెట్లు ఎక్కగానే, కుడి వైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడ పై పడి బయట ఉన్న రాజ గోపురం నీడ తల క్రిందులుగా చాల స్పష్టంగా కనబడుతుంది. దాని కెదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడా ఆ గోపురం ప్రతి బింబం కనబడుతుంది. "పిన్ పాయింట్ కెమెరా కటకం (లెన్స్) "
అన్న సూత్రము ద్వారా ఈ యొక్క తలకిందులైన ప్రతిబింబము మనకు కనిపిస్తుంది. మధ్యాహ్న కాలము మరియు సాయంత్రం కాలం సూర్యకాంతి అధికంగా ఉన్న సమయంలో గోపురం యొక్క తలకిందులైన రంగుఛాయాచిత్రము కూడా కనిపించును. దీన్ని చాల వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత సేపు ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిందే.
చిత్రమాలిక
మార్చు-
Virupaksha Temple
-
Virupaksha Temple
-
Virupaksha Temple as seen from above
-
Temple elephant of Virupaksha Temple
-
Nandi at Virupaksha Temple
-
One of the erotic carvings at Virupaksha
మూలాలు
మార్చు- ↑ "Virupaksha Temple at Hampi".
- ↑ "విరూపాక్ష పరిశోధన ప్రాజెక్టు". Archived from the original on 2007-07-13. Retrieved 2006-09-13.
- ↑ "శ్రీ విరూపాక్ష దేవాలయం". Retrieved 2006-09-13.
- ↑ "విరుపాక్ష". Archived from the original on 2003-03-26. Retrieved 2006-09-13.
- ↑ "విరుపాక్ష దేవాలయం , హంపి". Retrieved 2006-09-13.
- ↑ "విరూపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు". Archived from the original on 2007-07-13. Retrieved 2006-09-13.
- ↑ "శ్రీ విరూపాక్ష". Retrieved 2006-09-13.
- ↑ "విరూపాక్ష". Archived from the original on 2003-03-26. Retrieved 2006-09-13.
- ↑ "Details of Virupaksha Temple". హంపి.ఇన్. Archived from the original on 2007-06-21. Retrieved 2007-03-08.
- ↑ "Details of Virupaksha Temple". ఆంగ్ల వికి. Retrieved 2007-05-08.
బయటి లంకెలు
మార్చు- విరూపాక్ష దేవాలయం, హంపి travel guide from Wikivoyage
- Virupaksha temple Archived 2014-03-29 at the Wayback Machine