Jump to content

కంకణ (కన్నడ సినిమా)

వికీపీడియా నుండి
యు.ఆర్.అనంతమూర్

కంకణ 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చాడు. [1]

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]
  • రమ - రేవతి
  • కస్తూరి - దివ్య అధికారి
  • అమృత - వసుమతి
  • సుశీల - గిరిజ
  • వేదవల్లి - డి.భారతి
  • అంబిక - ప్రమీల
  • నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
  • సురేష్ - సురేష్ హెబ్లికర్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
  • కథ : త్రివేణి
  • సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
  • ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
  • కళ : ఆర్.ఎం.హాద్‌పాడ్
  • సంగీతం : హెచ్.జె.ఇమామ్‌
  • కూర్పు : ఉమేష్ కులకర్ణి

చిత్రకథ

[మార్చు]

అది మైసూరు పట్టణం. అప్పుడే బి.ఏ. పరీక్షలు రాసి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ కుర్చున్నారు ఆరుగురు అమ్మాయిలు. కాలేజీలో చదువుకుంటుండగా - వాళ్ళ మధ్య ఏర్పడిన మైత్రి అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు ఒక చోట కూర్చుని భవిష్యత్తు పట్ల తమ ఆశలు, ఆశయాలు చెప్పుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు.

ఒక్కొక్కరి కుటుంబంలోను రకరకాల సమస్యలు... రమ, సుశీలల కుటుంబాలు పెద్దవి.అంచేత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు సాయపడదామనుకున్నారు. వేదవల్లి గృహిణిగా స్థిరపడాలని అనుకున్నా, ఆమె నల్లగా ఉండడంవల్ల సంబంధం చేసుకోడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడగడడమో - లేదా పిల్ల నచ్చలేదనడమో ఆమెకు ఒక సమస్యగా పరిణమించించిది. కస్తూరికి పెద్ద చదువులు చదువుకుని - పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని కోరిక. అమృతకు పెళ్ళి మీద అంతగా ఆసక్తి లేదు. ఇక వాళ్ళందరితో పోలిస్తే - ఏ చీకూ చింతా లేని అమ్మాయి - అంబిక. ఆమె శ్రీమంతుల ఇంట్లో పుట్టడమే అందుకు కారణం!

చదువైపోగానే సరదాగా కొంత కాలం గడపకుండా అప్పుడే రకరకాల ఆలోచనలతో సతమతమైపోవడం ఎందుకని - అంబిక - తన స్నేహితురాళ్ళందరినీ తీసుకుని ' చిక్‌మగళూర్' లోని తన మామయ్యగారి కాఫీ ఎస్టేట్‌కు విహారయాత్రకు బయలుదేరింది.

అక్కడ ఈ అమ్మాయిలకు అంబిక అత్తగారి దూరపు బంధువు సురేష్ పరిచయం అయ్యడు. కస్తూరి సురేష్ పట్ల ఆకర్షణకు లోనయ్యింది. అతని వీళ్ళందర్నీ బేలూరుకు తీసుకువెళ్ళాడు. సురేష్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం కస్తూరిని ఊహాలోకాల్లో విహరింపజేసింది. అందరూ బేలూరు నుంచి శృంగేరి వెళ్దామనుకున్నారు. కానీ అక్కడి వాతావరణం కస్తూరికి పడకపోవడంతో ఆమెకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. తన స్నేహితురాళ్ళను విహారయాత్ర కొనసాగించమని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయింది. మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన సురేష్ ఆమెకు వైద్యచికిత్స చేశాడు. ఆ సమయంలోనే ఆమెపట్ల తనకు కలిగిన ప్రేమను వ్యక్తం చేశాడు.

విహారయాత్రను ముగించుకుని అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. రమ - ఒక కాంట్రాక్టరు భార్యకు చదువుచెప్పే ఉద్యోగాన్ని సంపాయించుకుంది. సుశీల ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌ అయింది. వేదవల్లి -సాల్డాన్హా అనే మాస్టరు వద్ద సితార్ నేర్చుకోసాగింది. మరోప్రక్క ఆమెకు పెళ్ళి చూపుల బేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమృత కుట్లూ అల్లికలతో కాలక్షేపం చేయసాగింది.

రమకు తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నా తరచూ స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్తూ వాళ్ళ క్షేమసమాచారాలు విచారిస్తూనే ఉంది. ఒకరోజు ఆమెకు బెలూరులో జరిగిన కస్తూరి సురేష్‌ల ప్రేమాయణం గురించి తెలిసింది. తన స్నేహితురాలి క్షేమం కోరి ఆమెను హెచ్చరించి సురేష్‌ను మరచిపొమ్మని చెప్పింది. కస్తూరి అది అంత తేలికైన విషయం కాదని, తనకు పెళ్ళంటూ జరిగితే సురేష్‌తోనే జరగాలనీ తను అతనిపై పెంచుకున్న ఆశలను స్నేహితురాలికి వివరించింది. తనకు ఇంట్లోవాళ్ళు ఏదో సంబంధం చూస్తున్నట్లు ఈ విషయం తను సురేష్‌కు రాసినట్లు కూడా ఆమె రమతో చెప్పింది. సురేష్ తనను తప్పక స్వీకరిస్తాడని కస్తూరి నమ్మకం.

కానీ సురేష్ తేనె పూసిన కత్తి అన్న సంగాతి ఆ అమాయకురాలు గ్రహించలేకపోయింది. అతను అంబికకు తానొక పెద్దమనిషిలా ఉత్తరం వ్రాస్తూ కస్తూరి తనను ప్రేమిస్తున్నట్లుగ ఉత్తరం రాసిందని, ఇలా ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించేసేంత బలహీనురాలా నీ స్నేహితురాలు అంటూ దెప్పిపొడుస్తూ, కస్తూరి తనకు రాసిన ఉత్తరాన్ని కూడా ఆమెకు పంపించాడు. అంబిక ఆ ఉత్తరాలు చూసుకుని హతాశురాలై, కస్తూరి నిర్మలమైన ప్రేమను గుర్తించలేక ఆమెను దూషించింది. ఆ అవమానాన్ని భరించలేక కస్తూరి ఆత్మహత్య చేసుకుంది.

రమ ప్రైవెటు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించిన కొన్నాళ్ళకు ఒక ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆమెకు టీచర్ ఉద్యోగం లభించింది. తన కుటుంబానికి ఎంతో సాయపడుతున్నానన్న ఆత్మ సంతృప్తితో పాటు, ఆమెకు విద్యార్థుల ఆదరాభిమానాలు కూడా లభించాయి. ముఖ్యంగా తన విద్యార్థులలో ఒకరైన నాగేంద్ర పట్ల ఆమెకు అభిమానం ఏర్పడింది. అతని హుందాతనం, వినయ విధేయతలు ఆమెను ఆకర్షించాయి. నాగేంద్ర్ కూడా ఒక పల్లెటూరులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా, తన ఉద్యోగంలో ఉన్నతావకాశాల కోసమని ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోడానికి వచ్చాడు.

రమ తను అంతర్గతంగా నాగేంద్రను ప్రేమిస్తున్నట్లు తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు.

ఒకరోజు దసరాపండుగ సందర్భంగా ఊళ్ళో ఏర్పాటు చేయబడిన ఎక్జిబిషన్‌కు రమ తన తమ్ముళ్ళను తీసుకుని బయలుదేరింది. అక్కడ ఆమెకు అమృత కనిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగ, సుశీల అడంబరమైన అలంకరణలతో విలాసంగా వెళ్తూ వుండడం చూశారు. సుశీల తప్పుదారిలో నడుస్తున్నట్లుగా రమతో చెప్పింది అమృత.

స్నేహితురాలిగా తనకున్న సహజమైన ఆతృతను దాచుకోలేక, సుశీల శ్రేయస్సును కాంక్షించే ధోరణిలో ఆమెకు సలహా చెబుదామని వెళ్ళింది రమ. సుశీల తన సంగతిని దాటవేస్తూ నాగేంద్ర గురించి అడిగేసరికి రమ విస్తుపోయింది.

సితారు మాస్టారు సాల్డాన్హాను ప్రేమించిన వేదవల్లి ఒకరోజు అతనితో కలిసి లేచిపోతుంది తనను అతను జీవితాంతం కపాడతాడన్న నమ్మకంతో. కొన్ని రోజుల తర్వాత ఆ సంగతి తెలుసుకున్న రమ వేదవల్లి బాగోగులు తెలుసుకుందామని ఆమె ఇంటికి వెళ్ళి అక్కడి స్థితి చూసి దిగ్భ్రాంతి చెందుతుంది. ఆప్పటికే సాల్డాన్హా గర్భవతి అయిన వేదవల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమె మానసిక సంక్షోభాన్ని చూడలేక సాల్డాన్హా ప్రతిరూపాన్ని చూడడానికి ఇష్టపడని వేదవల్లి కోరిక మేరకు రమ సుశీలలు ఆమెకు సహాయపడి, వల్లిని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు.

సమాజంలో స్త్రీలు అడుగడుగునా వంచింపబడుతూ ఉండడం కళ్ళారా చూస్తున్న రమకు జీవితం పట్ల ఒక విధమైన విరక్తి ఏర్పడుతుంది. ఇంతలో స్వయాన తన చెల్లెలే సినిమా గ్లామరు పట్ల ఆకర్షితురాలై - పేపరులోని ఒక ప్రకటన చూసి - తన ఫోటోను పంపించడానికి ఉద్యుక్తురాలౌతుంది. ఆమె సాహసానికి ఆశ్చర్యపడిన రమ - తన తమ్ముడు కేవలం చాక్లెట్ల కోసం డబ్బు దొంగిలించే స్థితికి దిగజారడం చూశాక - ఆమెలో సంఘర్షణ ప్రారంభమౌతుంది.

సమాజంలో ఆర్థికపరంగా ఉన్న తేడాలు, వాటి ఫలితంగా ఏర్పడే పరిణామాల కారణంగా మనుషులు ఏ విధంగా పతనమయ్యేదీ చూస్తూ ఉన్న ఆమె - తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి వచ్చింది.

తరచుగా తన మేనల్లుడికి సంబంధాలు చూడడానికి ప్రయత్నించే పండిట్ అలవాటు ప్రకారం తనను చూడడానికి వచ్చేసరికి - ఈ సారి అతనికి తన అంగీకారాన్ని చెప్పింది. ఆయన మేనల్లుడు పుట్టుగ్రుడ్డి అయితేనేం... అతనికి బోలెడంత ఆస్తి ఉంది. కాఫీ తోటలున్నాయి. అతన్ని చేసుకుంటే సుశీలలా తన చెల్లెలి జీవితం పతనం కాదు. తన తమ్ముడు దొంగ కాలేడు. తన కుటుంబంలోని అందరికీ 'రేపు ఎలా?' అన్న సమస్య ఉండదు.

సమస్యలు తీర్చడానికనే కంకణం కట్టుకున్న రమను తన జీవిత భాగస్వామిగా చేసుకోవలని వెదుక్కుంటూ వచ్చాడు నాగేంద్ర. ఆమె తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయాన్ని విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపొయాడు.

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 November 1975). "కంకణ". విజయచిత్ర. 10 (5): 12–13, 64.

బయటి లింకులు

[మార్చు]