కద్రువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కద్రువ కశ్యపుని భార్య. ఈమె తండ్రి దక్షుడు, తల్లి ధరణి. దితి, అదితి ఈమె సవతులు. వేయి సర్పాలు ఈమె సంతానం. శాప కారణంగా ఈమెకు వినత దాసి అవుతుంది. కశ్యవుని భార్యలలో ఒకతె. దక్షుని కూఁతురు. ఈమెయందు నాగకులము పుట్టెను. అందు ఆదిశేషువు జ్యేష్ఠుఁడు. వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.[1]

ఒకదినము సాయంకాలమున కద్రువయు, ఆమెసవతి వినతయు పాలసముద్రము గట్టున విహరించుచు ఉండి అచ్చట మేయుచు ఉండిన ఉచ్చైశ్రవమును చూచి కద్రువ 'అక్కా ఈగుఱ్ఱము దేహము అంతయు తెల్లఁగా ఉండియు తోఁకమాత్రము నల్లగా ఉన్నది చూచితివా' అని చెప్పెను. వాస్తవముగా తోఁకయు తెల్లగానే ఉన్నందున వినత 'అట్లులేదు నీవు చక్కగా చూడుము' అని చెప్పెను. అది విని కద్రువ 'అది దూరముగా ఉన్నది కనుక నీకు చక్కగా తెలియలేదు దగ్గఱపోయిచూచి నల్లగా ఉండినయెడ నీవునాకు దాసివి అగుము, లేనియెడ నేను నీకు దాసిని అయ్యెదను' అని, పందెమువేసికొని అది అస్తమయసమయముగా ఉన్నందున మఱునాఁడు తెల్లవాఱి వచ్చి చూచునట్లు నిష్కర్ష చేసికొనిరి. అనంతరము కద్రువ తన కొడుకులవద్దకు పోయి వారికి, తనకును వినతకును జరిగిన వాగ్వాదమును పందెమువేసికొనుటను తెలియపఱిచి మఱుసటినాటి ఉదయమున తాను సముద్రతీరమునకు వచ్చువేళకు ఆగుఱ్ఱము తోఁక నల్లగా ఉండునట్లు చేయవలయును అని వేఁడుకొనెను. అందుకు శేషుఁడు మొదలయిన కొందఱు అది అధర్మము అని ఆపనికి సమ్మతింపక పోఁగా సర్పములు అన్నియు జనమేజయుని సర్పయాగమునందు పడి నశించునట్లు కద్రువ శపించెను. శపింపఁగానే ఆశాపమునకు వెఱచి కర్కోటకుఁడు అనువాఁడు తల్లి ఇష్టప్రకారము చేసెను కనుక వినత కద్రువకు దాసి అయ్యెను. ఈదాసీత్వమును గరుడుఁడు మాన్పెను. (చూ|| గరుడుఁడు.) ఆదిశేషుఁడు మహాతపము ఆచరించి విష్ణుప్రసాదము పడసి అతనికి పాన్పై వేయిపడగలతో భూమిని మోయుచు ఉండును. వాసుకి రుద్రునికి భూషణము అయ్యెను.

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫ్యామిలీ (15 July 2016). "నేడు వరల్డ్ స్నేక్ డే". Sakshi. Archived from the original on 28 May 2017. Retrieved 30 June 2020.