చింతా వెంకట్రామయ్య
చింతా వెంకట్రామయ్య | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | చింతా వెంకట్రామయ్య 1860 |
మరణం | జనవరి 6 1949 |
వృత్తి | నృత్య కళాకారులు |
పౌరసత్వం | భారతీయుడు |
రచనా రంగం |
|
విషయం | |
సంతానం | 2 కుమారులు |
కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు, కూచిపూడి నాట్యత్రయంలో ఒకరు చింతా వెంకట్రామయ్య.
యక్షగాన పితామహుడిగా, కూచిపూడి నాట్య మహా మహోప్యాధ్యాయుడైన చింతా వెంకట రామయ్య తమ అగ్రజుడు చింతా రత్తయ్య, ఏలేశ్వరపు నారాయణప్పల సాన్నిధ్యంలో నాట్య శిక్షణలో ఆరితేరారు. భక్త ప్రహ్లాద, ఉషా పరిణయం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం వంటి నాటకాలలో స్వయం ప్రతిభ సంతరించుకుని, భారతదేశమంతటా వాటిని సుప్రసిద్ధం చేశారు. నాట్య శాస్త్ర ప్రకాండులైన వేదాంతం చలపతి, ఆది నారాయణ, భరత కళా ప్రపూర్ణ వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యనారాయణ శర్మ (పెద్ద సత్యం), పసుమర్తి కృష్ణమూర్తి, వేదాంతం పార్వతీశం, భాగవతుల రామకోటయ్య, పసుమర్తి వేణుగోపాల శర్మ, వేము పూర్ణచంద్రరావు, ఆయన కుమారులూ, భరత నాట్య కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి ఆయన శిష్యులే.[1]
పై వారిలో శ్రీ చింతా వెంకటరామయ్య గారు సుప్రసిద్ధులు. అనాటి వెంకటరామా నాట్య మండలిని 100 సంవత్సరాల క్రితం స్థాపించి, అవిచ్ఛిన్నంగా నిర్వహించి, ఆ సంస్థ ద్వారా అనేక మంది వుత్తమ నటశేఖరలను సృష్టించి, ఈ నాటి కూచిపూడి నాట్య కళకు దివ్య యశస్సును ఘటిల్ల జేసిన ప్రముఖ నాట్యాచారుడు.
జీవిత విశేషాలు
[మార్చు]చింతా వెంకటరామయ్యగారు 1860 వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి శివరామయ్య; తల్లి అరుంధతమ్మ. పది సంవత్సరాల ప్రాయంలోనే పాటలో, ఆటలో, హాస్యంలో అనుభవం సంపాదించి, భామవేషపు దరువుల్ని పాడుతూ వుండేవారు. వెంకాటరామయ్యగారి ప్రాతిభా విశేషాలను గనమించి ఏలేశ్వరపు నారాయణప్ప గారు వారి మేళంలో చేర్చుకున్నారు. 12 వ సంవత్సరం లోనే అన్నగారైన వెంకటరత్నం గారి వద్ద నాట్య శిక్షణను ప్రారంభించి 16 సంవత్సరాలకే విశేష నాట్యశాస్త్రానుభవాన్ని సంపాదించారు.
వీరు భాగవతామేళాన్ని 1875 నుండి దాదాపు 1936 వరకూ నిర్వహించారు. ఈనాడు నిర్వహించబడుతున్న వెంకటరామా నాట్యమండలి 1875 లో వెంకట రామయ్య ప్రారంభించినదే. కొంతకాలం భాగవతమనే పేరుమీద, భామాకలాపాన్ని ప్రదర్శించారు. ప్రజాభిరుచుల్ని అనుసరించి యక్షగానాలను ప్రవేశపెట్టి, ప్రహ్లాద, ఉషాపరిణయం, గయోపాఖ్యానము, రుక్మాంగద, రామ నాటకం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం మొదలైన నాటకాలను ప్రదర్శించి ప్రజామన్ననల్ని పొందారు.
ప్రయాణ సౌకర్యాలు లేని ఆనాడు ఆంధ్రదేశపు నాలుగు చెరగులా ఎద్దుల బండ్లలో ప్రయాణం చేసి ప్రదర్శనలిచ్చి, ఉన్నతాధికారుల వద్దా, సంస్థానాధీశ్వరుల వద్దా పారితోషికాలు పొందారు.
ఆధునికులలో వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తిగార్లు ముఖ్యులు. వేదాంతం రాఘవయ్య గారిని పాత్ర నిర్వహణలో సర్వసమర్థునిగా తయారు చేసి 1934 లో మద్రాసులో గూడవల్లి రామబ్రహ్మంగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో, తాము సూత్రధారులుగా ప్రదర్శనమిప్పించి, 'సెహభాష్ ' అనిపించి, నాటి రాఘవయ్యగారి ఉన్నత స్థానానికి పునాదులు వేశారు. వెంకట్రామయ్యగారి శిష్యులలో పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ కడపటి వారు.
వెంకటరామయ్యగారి శిక్షణ విచిత్రమైంది. వారికి ఏ సమయంలో, ఏ అడుగు, ఏ భావం, ఏ రీతి, ఏ భంగిమ స్ఫురణకు వస్తే అదల్లా అప్పుడే అక్కడే శిష్యులకు బోధించేవారు. ఇంతటి ప్రతిభావంతుడైన వెంకట్రామయ్య 90 సంవత్సరాలు ధ్రువతారగా వెలుగొంది 1949 జనవరి 6 న కీర్తిశేషులైనారు.