తుమరాడ సంగమేశ్వరశాస్త్రి
తుమరాడ సంగమేశ్వరశాస్త్రి | |
---|---|
జననం | తుమరాడ సంగమేశ్వరశాస్త్రి 1874 పాలకొండ తాలూకా బిటువాడ |
మరణం | 1932 |
ప్రసిద్ధి | ప్రముఖ వీణా విద్వాంసులు |
తండ్రి | సోమయాజి, |
తల్లి | గున్నమ్మ |
తుమరాడ సంగమేశ్వరశాస్త్రి (1874 - 1932) ప్రముఖ వీణా విద్వాంసులు. వీరు పాలకొండ తాలూకా బిటువాడ అగ్రహారంలో సోమయాజి, గున్నమ్మ దంపతులకు జన్మించారు. తన ఎనిమిదవ ఏట సుప్రసిద్ధ గాయకులు నందిగానం వెంకయ్య వద్ద సంగీతం నేర్చుకోవడానికి బొబ్బిలి వెళ్ళారు. కొంతకాలం తరువాత వీణావాదన నేర్చుకోవడం ప్రారంభించారు. తరువాత పరవస్తు వెంకట రంగాచార్యులు విశాఖపట్టణంలో గోడే వారి ఆస్థానంలో కచేరీ చేయించి సత్కరించారు. తరువాత కసింకోట జమిందారు ఆదరానికి పాత్రులైనారు. తల్చూరి సింగరాచార్యులు వీరి ప్రతిభను గుర్తించి చెన్నై తోడ్కొనిపోయి అక్కడ తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించారు. అక్కడి 'శ్రీకృష్ణ గానసభ' సువర్ణ కంకణమిచ్చి సన్మానించింది. పిఠాపురం మహారాజు తన ఆస్థాన వైణికునిగా నియమించుకున్నారు. వీరి కీర్తి మహారాజు ప్రాపున గాయక లోకంగా విస్తరించింది. రాజావారు తన మిత్రుడైన రవీంద్రనాధ టాగూరుతో పరిచయం కల్పించారు. టాగూరు తనతో కోల్కతా తీసుకొని వెళ్ళి రెండు నెలలపాటు వీరి గాన మాధుర్యాన్ని విన్నారు. శాంతినికేతన్ లో విద్యార్ధులకు వీణలో శిక్షణ ఇవ్వడానికి నియమించారు.
శాస్త్రిగారి వీణాసాధన అపూర్వం; మామూలు త్రిస్థాయిని నాలుగవ కాలంలో వెయ్యి ఆవృత్తులు వీణను దించకుండా వాయించడమే కాక "నాగబంధ సాధనం" అనే ఇంకొక విధానాన్ని అభ్యసించారు. అలంకారాలలో ఉన్న స్వర గ్రామంలో ముందుకు, వెనుకకు పాము మెలికలు తిరిగేట్లు వేదపాఠకులు ఘనాన్ని వల్లెవేసినట్లు చేసే సాధనకు నాగబంధమని పేరు. ఇలా సాధన చేయడం వలన వీరి వ్రేళ్ళకు బలం, వేగం, మాధుర్యం అద్భుతంగా అబ్బినవి. ఘనం మీటులలో కత్తెరమీటు అతని సొమ్ము. స్వర విన్యాసానికి తనకు సప్తస్వర స్థానాలు అక్కరలేనట్లు ఒక్క స్వరస్థానం లోనే స్వరలోకాన్ని సృజిస్తూ వీరు వీణను వాయించేవారు. వీరి జీవితమంతా నాద బ్రహ్మోపాసనలోనే లగ్నమవటం చేత ధనార్జన ఆశ ఉండేది కాదు. వీరు నిరాడంబర జీవులు, సాత్విక స్వభావులు. 'గణనాయకం శుభదాయకం' అనే ఒక కీర్తనను కల్యాణి రాగంలో సంగమేశ్వర ముద్రతో రచించారు.
అంబ ఐహికమూర్తియే వీణ అని వీరి వాదన. తనకు మరణమాసన్నమైనది ముందే గ్రహించిన శాస్త్రి గారు ఓపిక తెచ్చుకొని, వీణను తన గుండెలపై పెట్టుకుని ఆనంద బైరవి రాగము ఆలపిస్తూ తృప్తిగా కన్ను మూశారు. వీరు మరణశయ్యపై కూడా మహత్తర శ్రుతితో ఆనందభైరవి రాగం ఆలపిస్తూ తన ఆత్మను నాదబ్రహ్మలో ఐక్యం చేసుకున్నారు.
మూలాలు
[మార్చు]- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- సంగీత ప్రయోగ దీపిక, ముక్తావళీ మాథుర్, ముద్రా బుక్స్, విజయవాడ, 2004.