దధీచి మహర్షి
దధీచి (Dadhichi) హిందూ పురాణాలలో ప్రసిద్ధిచెందిన త్యాగమూర్తి.
దధీచి జననం
[మార్చు]దధీచి భార్గవ వంశంలో సుకన్య, చ్యవన మహర్షుల పుత్రుడు (దధీచి, కర్దమ ప్రజాపతి పుత్రికయైన శాంతి కుమారుడని కొందరందురు). సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక. ఒకనాడు ఆమె తండ్రితో క్రీడార్ధం అడవులకు వెళ్ళింది. అక్కడ చ్యవన మహర్షి తపోనిష్టలో వున్నాడు. శరీరమంతా పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రం మహాతేజస్సుతో వెలుగుతున్నాయి. సుకన్య వానిని మిణుగురులని భావించి పుల్లతో పొడవగా అతని కండ్లు పోయాయి. జరిగిన అపచారం తెలుసుకుని శర్యాతి చ్యవనుని క్షమాభిక్ష కోరాడు. చ్యవన మహర్షి సుకన్యనిచ్చి తనకు వివాహం చేస్తే దోషం పరిహరమౌతుందంటాడు. శర్యాతి బాధపడినా, విజ్ఞురాలైన సుకన్య వివాహానికి అంగీకరించింది. పరమ సౌందర్యరాశియైన సుకన్య అంధుడైన చ్యవన మహర్షికి సహధర్మచారిణిగా భక్తిశ్రద్ధలతో జన్మను సార్ధకం చేసుకుంటున్నది.
దధీచికి గుర్రపు తల
[మార్చు]ఇంద్రుడు అయాచితంగా అతని దగ్గరికి వచ్చి అనేక మహా అస్త్రాలను, బ్రహ్మవిద్యను దధీచికి నేర్పాడు. అయితే వీటిని దధీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని స్పష్టం చేశాడు. అశ్వినీ దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా కోరారు. దధీచి అందుకు అంగీకరించాడు. అయితే ఇంద్రుడు విధించిన నిబంధనను వారికి తెలియజేశాడు. శస్త్రవిద్యా నిపుణులైన దేవ వైద్యులు చతురులు. వారు దధీచి తలను స్వయంగ ఖండించి, ఆ స్థానంలో ఒక అశ్వం శిరస్సు నుంచి, తద్వారా మహాశాస్త్రాలనధ్యయనం చేశారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వ శిరస్సును ఖండించాడు. వెంటనే అశ్వనీ దేవతలు తాము భద్రపరిచిన దధీచి నిజ శిరస్సును తిరిగి స్వస్థానంలో అతికించారు.
దేవతల ఆయుధాల పరిరక్షణ
[మార్చు]ఒకసారి దేవతలకు దానవులకు మధ్య యుద్ధ విరమణ జరిగింది. యుద్ధంలో అమితమైన నష్టం జరిగింది. మళ్ళీ యుద్ధం జరుగకుండా ఉండాలంటే అస్త్రశస్త్రాలేవీ లేకపోవడమే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. వాటిని ధ్వంసం చేయకుండా దాచి ఉంచడమే మంచి మార్గమని వారికి తోచింది. దధీచి బ్రహ్మజ్ఞాని, మహతపస్వి, శక్తి సంపన్నుడు. ఆయన ఆశ్రమం శత్రువులను కూడా సఖ్యపరచు శాంతి వనము. అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దధీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. దేవతల కోరికను దధీచి అంగీకరించాడు. ఆయన సతీమణి మహాపతివ్రత గభస్తిని పతి క్షేమం దృష్ట్యా అందుకు అభ్యంతరం తెలిపింది. అయినా ధడిచి అస్త్రాలను భద్రపరిచాడు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి అస్ర్తాలను నీరుగా మార్చితాగాడు. తర్వాత దేవతలు మా అస్ర్తాలు మాకీమ్మన్నారు. అప్పుడు ఆ అస్ర్తాలు తన ఎముకలను పట్టి వున్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహీంచుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది
మూలాలు
[మార్చు]- తూములూరి లక్ష్మీనారాయణ: త్యాగమూర్తి దధీచి, శ్రీనివాస బాలభారతి-9, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1980, 1999.