మొఘల్ చిత్రకళ
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మొఘల్ చిత్రకళ (ఆంగ్లం: Mughal Painting) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ లఘుచిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాల ప్రభావం చూపాయి.
ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు లఘుచిత్రాలుగా (miniatures) ఉన్నాయి. సాధారణంగా వీటి పరిమాణం అంగుళాల కొలతల్లో ఉంటాయి. భారతదేశంలో లఘుచిత్రాలను నూలువస్త్రంపై, చేతితో తయారైన కాగితంపై, చెక్క ఫలకాలపైన గీయడం అనేది మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ప్రారంభమైంది. మొఘల్ చిత్రకళకు పూర్వం మనదేశంలో లఘుచిత్రణ కేవలం తాళపత్రాలపై మాత్రమే జరిగేది. అక్బర్ చక్రవర్తి పోషణలో ఆగ్రాలో ఒక ఇంపీరియల్ చిత్రశాల స్థాపించబడింది. మొఘల్ చిత్ర శైలిలో అద్భుతమైన చిత్రాలను సృష్టించడంలో దర్బారుకు చెందిన మేటి చిత్రకారులతో పాటు ఈ చిత్రశాలకు చెందిన వందలాది చిత్రకారుల సామూహిక కృషి తోడ్పడింది.
మొఘల్ చిత్రకళ దాదాపుగా లఘుచిత్రాలకే పరిమితమైందని చెప్పవచ్చు. వీరి లఘుచిత్రాలలో కొన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రాలుగా ఉంటే, మరికొన్ని ఆల్బమ్ (muraqqa) చిత్రాలుగా ఉన్నాయి. మొఘల్ చిత్రకారులు ఆల్బమ్‌ల కోసం అనేక లఘుచిత్రాలలో పుష్పాలు, మొక్కలు, పక్షులు, జంతువులను ప్రధానంగా తీసుకొని వాటిని ఎంతో వాస్తవికతతో చిత్రీకరించారు.
మొఘల్ చిత్రకళా శైలిలో పర్షియన్ క్లాసిక్ గ్రంథాలతో పాటు భారతీయ గ్రంథాలకు కూడా చిత్రరచన కొనసాగింది. వీటిలో పేర్కొనతగ్గది. "హంజనామా" అనే పర్షియన్ బృహత్గ్రంధం. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ గ్రంథంలోని దృశ్యాలకు సంబంధించి సుమారు 1400 కు పైగా చిత్రాలను 100 మందికి పైగా భారతీయ చిత్రకారులు సమష్టికృషితో ఒక పెద్ద నూలువస్త్రంపై చిత్రించడం జరిగింది. ఇదే కోవలో బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా, పాద్ షా నామా వంటి రాచరిక 'స్వీయ చరిత్ర' గ్రంథాల లోని దృశ్యాలకు చిత్ర రచన సాగింది. అదేవిధంగా భారత, రామాయణ, హరివంశం, శుకసప్తతి గాథలు వంటి కావ్యాలను పర్షియన్ భాషలో అనువదించి వాటికి సైతం రమణీయమైన చిత్రాలను గీయడం జరిగింది.
మొఘల్ చిత్రకళలో వైవిధ్యత అత్యధికం. వీరి చిత్రాలలో వైవిధ్యభరితమైన దృశ్యాలు విరివిరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు, ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలు మొదలైనవి అనేకంగా అలరిస్తాయి.
ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాతి కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు లఘుచిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటాల్లొనే మరింత ఆసక్తిని కనపరిచారు. రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవికథోరణితో వున్న ఆ నాటి రూపపట చిత్రాలు మొఘల్ చిత్రకళలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.
ఔరంగజేబు కాలంలో రాజాదరణను కోల్పోయిన అనేక చిత్రకారులు ఇతర రాజ్యాలకు తరలిపోయారు. తదనంతరకాలంలో మొఘల్ చిత్రకళా శైలి ఇతర హిందూ, ముస్లిం ప్రాంతీయ రాజ్యాలకు, ఆ తరువాత సిక్కు ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది. ఇది ఆయా సంస్థానాలలో అనేక ప్రాంతీయ చిత్రకళా శైలులను అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. ఈ కాలంలోనే చిత్రకళ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిందూ పురాణేతిహాస గాథా చిత్రణతో ముడిపడటం కనిపిస్తుంది. అయితే ప్రాంతీయ చిత్రకళారీతులకు సంబంధించిన చిత్రాలు రాశి పరంగా ఎక్కువగా వున్నప్పటికీ వాసి పరంగా తక్కువ సొగసుతో అభివ్యక్తమయ్యాయి. వీటిని తరచుగా "మొఘల్ తదనంతర", "ఉప-మొఘల్" లేదా "ప్రాంతీయ మొఘల్" చిత్రకళగా అభివర్ణిస్తారు.
మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం
[మార్చు]మొఘల్ చిత్రకళకు మూలం పర్షియన్ చిత్రకళ. ఈ పర్షియన్ చిత్రకళ మంగోలియన్ చిత్రకళ చేత ప్రభావితమైంది. పర్షియాలో సఫావి (Safawi) రాజవంశీయులు ఈ చిత్రకళాభిమానంతో మంగోలియన్ చిత్రకారులను తమదేశానికి ఆహ్వానించి వారిచే తమ ప్రజలకు ఈ చిత్రకళారీతిని నేర్పింప చేశారు. పర్షియా సఫావి సుల్తాన్ 'షా ఇస్మాయిల్' కాలంలో, బిహజాద్, మిరాక్ వంటి విఖ్యాత చిత్రకారుల కృషితో ఈ మంగోలియన్ చిత్రకళ పూర్తిస్థాయి పర్షియన్ చిత్రకళగా రూపుదిద్దుకొంది. భారతదేశంలో మొఘుల్ చక్రవర్తి హుమాయూన్ పదవీచ్యుతుడైనపుడు దేశం వదిలి పర్షియాలో తలదాచుకొన్నాడు. సహజంగా చిత్రకళాభిమాని అయిన హుమాయూన్ పర్షియాలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అక్కడ బిహజాద్ వంటి మేటి ఆస్థాన చిత్రకారుల పరిచయ సంపర్కంతో ఈ పర్షియన్ చిత్ర శైలి పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. సా.శ. 1555 లో తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత తనతోపాటు మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ అనే విఖ్యాత చిత్రకారులను తీసుకొనివచ్చాడు. ముఖ్యంగా క్వాజా అబ్దుస్ సమద్ రాకతో భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు. 1562 నాటికి సుల్తాన్ దర్బారులో కొలువుతీరిన పర్షియన్ చిత్రకారులు భారతీయ చిత్రకారులకు తమ నూతన చిత్రకళారీతులను నేర్పించడం ప్రారంభించారు. దానితో భారతదేశంలో మొఘల్ చిత్రకళ వేళ్లూనుకోవడం ప్రారంభమైంది.
ఈ విధంగా మంగోలియన్ చిత్రకళ పర్షియాలో పర్షియన్-మంగోలియన్ పద్ధతిగా ఏర్పడింది. 1560 వరకు భారతదేశంలో ఈ పద్ధతి అమలులో ఉండేది 1562 నాటికి ఇది అప్పటికే భారతదేశంలో వాడుకలో వున్న స్థానిక విజయనగరం, బీజాపూర్, అహ్మద్ నగర్, రాజపుత్ర చిత్రకళా పద్ధతులతో కలసి భారత-పర్షియా-మంగోలియా సమ్మేళన రీతిగా రూపొందింది. దీనినే మొఘల్ చిత్రకళా రీతి అని వ్యవహరిస్తారు. 1562 లో చిత్రించిన "అక్బర్ దర్బార్ లో తాన్ సేన్ ప్రవేశించిన దృశ్యం" చిత్రపటంలో ఈ మొఘల్ చిత్రకళా రీతి మొట్టమొదటగా కనిపిస్తుందని విమర్శకులు పేర్కొంటారు.
మొఘల్ చిత్రకళా విస్తృతి
[మార్చు]మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది.
1. గ్రంథ చిత్రణ (Illustrated books)
2. దర్బారీ చిత్రణ
ఒక గ్రంథం లోని విషయాలను వివరిస్తూ గీయబడిన చిత్రాలను ఇలస్ట్రేషన్స్ (గ్రంథస్త విషయవివరణ చిత్రాలు) గా పేర్కొంటారు. ఈ విధంగా ఒక గ్రంథానికి చిత్రాలు చేర్చబడటాన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రరచన లేదా గ్రంథ చిత్రణగా వ్యవహరిస్తారు. ఆగ్రాలోని రాచరిక చిత్రశాలకు చెందిన మొఘల్ చిత్రకారులు పర్షియన్ భాషలో వున్న వందలాది గ్రంథాలకు రమ్యమైన చిత్రాలు గీసేవారు. ఈ విధంగా రాచరిక చిత్రశాల పర్షియన్ క్లాసిక్ గ్రంథాలతో పాటు అనువాదిత భారతీయ కావ్యాలకు సైతం ఎక్కువ సంఖ్యలో గ్రంథ ప్రతులను (ఇలస్ట్రేటెడ్ కాపీ) రూపొందించేది.
దర్బారీ చిత్రకళ మొఘల్ చక్రవర్తుల ప్రీతర్ధ్యం రూపుదిద్దుకొంది. దీనిలో భాగంగా వైవిధ్యభరితమైన దృశ్యాలు కోకోల్లలుగా చిత్రించబడ్డాయి. దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలతో కూడిన చిత్రాలు అనేకంగా అలరిస్తాయి. దీనిలో మరో భాగమైన రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.
గ్రంథ చిత్రణ (Illustrations)
[మార్చు]మొఘల్ చిత్ర శైలిలో వెలువడిన సచిత్ర గ్రంథాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంథాలు) 1550 నాటి తుతినామ గ్రంథం బహుశా మొట్టమొదటిది కావచ్చు. ఆగ్రా రాచరిక చిత్రశాలలో రూపుదిద్దుకున్న ఈ గ్రంథం ప్రస్తుతం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్ మ్యూజియంలో ఉంది. దీనిలో సుమారు 250 వరకు సరళమైన లఘుచిత్రాలు (miniatures) ఉన్నాయి. దీనితో పోలిస్తే "హంజనామా" సచిత్ర గ్రంథ చిత్రణ బృహత్తరమైనది మాత్రమే కాక అసాధారణమైంది. ఈ పర్షియన్ కావ్యానికి సచిత్ర గ్రంథ ప్రతి 4800 పేజీలతో, 14 సంపుటిలతో తయారైంది అందులోను సాధారణ కాగితం మీద కాకుండా గట్టిగా నేసిన నూలు వస్త్రంమీద దాదాపు 1,400 కు పైగా రమణీయమైన లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. ఈ గ్రంథానికి బొమ్మలు సమకూర్చే ప్రక్రియ 1562 లో ప్రారంభమై 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ అపూర్వ చిత్ర రచనా బృంద కృషిలో పర్షియన్ చిత్రకారులతో పాటు భారతదేశం నలుమూలల నుండి వచ్చిన వంద మందికి పైగా భారతీయ చిత్రకారులు సమష్టిగా పాల్గొన్నారు. 1580 నాటికి మొఘల్ రాచరిక చిత్రశాల ఇటువంటి అనేక పర్షియన్, భారతీయ గ్రంథాలకు రమణీయమైన చిత్రాలను రూపొందించింది.
మొఘల్ రాజవంశపు జీవిత చరిత్ర గ్రంథాలు కూడా లఘుచిత్రాలతో చిత్రించబడ్డాయి. ఈ సంప్రదాయం బాబర్ నామా గ్రంథంతో ప్రారంభమైనప్పటికీ, అక్బర్ కి ముందున్న కాలంలో రాచరిక జీవితచరిత్ర గ్రంథాలకు చిత్రాలు సమకూర్చబడలేదు. తుర్కీ భాషలో వున్న బాబర్ స్వీయ చరిత్ర 'తుజ్ కీ బాబరీ'ను అతని మనవడు అక్బర్ పర్షియన్ భాషలోకి బాబర్ నామా (1589) పేరుతొ అనువదింపచేసాడు. తరువాత దానిని నాలుగు సుందరమైన సచిత్ర రాతప్రతులలో చిత్రింపచేసాడు. ఒక్కొక్క ప్రతిలో 183 లఘుచిత్రాలు ఉన్నాయి. అక్బర్ 1590 లలో తన వంశ పూర్వీకుడైన తైమూర్ జీవిత చరిత్ర 'జాఫర్ నామా' (యాజ్డి విరచితం) గ్రంథానికి సచిత్ర రచన చేయించాడు. కాని అతని అత్త గుల్ బదన్ బేగం, తన తండ్రి హుమాయున్ జీవిత చరిత్రను వ్రాసినప్పటికీ, దానికి సంబంధించిన సచిత్ర రాతప్రతి పూర్తిగా లభ్యం కాలేదు. అక్బర్ జీవిత చరిత్రను అబ్దుల్ ఫైజీ 'అక్బర్ నామా' పేరుతొ పర్షియన్ భాషలో వ్రాయడం జరిగింది. 1594 లో పూర్తయిన అక్బర్ నామా సచిత్ర గ్రంథ చిత్రరచనాకృషిలో బసవన్ వంటి ప్రఖ్యాత చిత్రకారునితో సహా మొత్తం 49 మంది చిత్రకారులు పాలుపంచుకున్నారు. 116 లఘుచిత్రాలతో వున్న అక్బర్ నామా సచిత్ర రాత ప్రతి ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. అదేవిధంగా జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా (తజక్-ఎ-జహంగీరి), షాజహాన్ జీవిత చరిత్ర 'పాద్ షా నామా' గ్రంథాలకు రమణీయమైన లఘుచిత్రాలు కూర్చడం జరిగింది. పాద్ షా నామా గ్రంథం (1650) తో రాచరిక స్వీయ చరిత్ర గ్రంథాలకు ఘనంగా సచిత్ర రచనలు చేయడం ఆగిపోయింది.
మొఘల్ చిత్రకళా రీతిలో ప్రాచీన పర్షియన్ కావ్య సంపుటిలకు కూర్చిన లఘుచిత్రాలు సాధారణంగా రాశిలో తక్కువ (ఇరవై వరకు) అయినప్పటికి వాసిలో మాత్రం ఘనంగా ఉన్నాయి. అక్బర్ కాలంలో ప్రాచీన పర్షియన్ గ్రంథాలతో పాటు పర్షియన్లోకి అనువాదితమైన భారత, రామాయణ, హరివంశం లాంటి హిందూ పురాణేతిహాసాలకు, కావ్యాలకు కూడా సుందరమైన చిత్రాలు గీయడం జరిగింది. ఉదాహరణకు అక్బర్ వద్ద పర్షియన్ అనువాదిత రామాయణానికి సంబంధించి ఒక సచిత్ర గ్రంథ రాతప్రతి, రంజ్ నామా (మహాభారతానికి పర్షియన్ అనువాదం) కు సంబంధించి నాలుగు సచిత్ర గ్రంథ రాతప్రతులు వుండేవి. ఆక్బర్ శుకసప్తతి గాథలను తూతినామా పేర పర్షియన్ భాషలోకి అనువదింపచేయడమే కాకుండా దానిని రమణీయమైన చిత్రాలతో అలకరింపచేసాడు. ఈ కాలంలోనే లీలావతి, లైలా-మజ్ను వంటి అనేక గ్రంథాలు చక్కని చిత్రాలతో వెలువడ్డాయి.
జంతువులు, మొక్కల చిత్రణ
[మార్చు]మొఘల్ చిత్రకళలో ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న అంశం మొక్కలు, జంతువుల చిత్రణ. వీటిని మొఘల్ చిత్రకారులు అత్యంత ప్రతిభావంతంగా జీవకళ ఉట్టిపడేటట్లు వాస్తవికతతో చిత్రించారు. బాబర్ స్వీయ చరిత్ర 'బాబర్ నామా' లో పుష్పాల, మొక్కలు, జంతువులకు సంబంధించిన అనేక వర్ణనలు ఉన్నాయి. అక్బర్ కాలంలో ఈ గ్రంథానికి, దానిలోని వర్ణనల కనుగుణంగా అందమైన చిత్రాలు జతపరచబడ్డాయి. పక్షులు, జంతువుల చిత్రాలు గీయడంలో ఉస్తాద్ మన్సూర్ మంచి ప్రావీణ్యం కనపరిచాడు. మొఘల్ చిత్రకళా చరిత్రకారుడైన మిలో సి. బీచ్ ప్రకారం మొఘల్ చిత్రకళలో సహజత్వం ఉట్టిపడుతుండేది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన తొలినాటి జంతు చిత్రాలను పరిశీలిస్తే, వారు తాము ఎన్నుకొన్న చిత్రవస్తువు (theme) ను కొత్తగా, వినూత్నంగా పరిశీలించడం కన్నా, ఆ వస్తువు లోనే వైవిధ్యత ఎక్కువగా ప్రదర్శించారని తెలుస్తుంది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన జంతువుల బొమ్మలపై, చైనా దేశంలో కాగితంపై తయారైన సాదా సీదా జంతు చిత్రాల ప్రభావం కొంతమేరకు ఉందని గుర్తించడం జరిగింది.
రూపపట చిత్రణ (portraiture)
[మార్చు]మొఘల్ యుగంలో చిత్రకారులు మొదటినించి వాస్తవికతను ఆధారంగా చేసుకొని రూపపట చిత్రాలను రూపొందించారు. నిజానికి వాస్తవిక చిత్రణ (realistic portraiture) అనేది పర్షియన్ లఘుచిత్రకళలో గాని లేదా అంతకు పూర్వం వున్న భారతీయ చిత్రకళలో గాని ఒక లక్షణంగా ఎన్నడూ లేదు. ఒక విధంగా మొఘల్ చిత్రకారులతోనే వాస్తవిక రూపపట చిత్రాలను గీయడం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రూపపట చిత్రాలన్నీ టెంపెరా పద్ధతిలో గీయబడ్డ నీటి వర్ణ చిత్రాలు. అక్బర్ పాలనా కాలం వరకూ మొఘల్ చిత్రకారులు రూపపటాలను పార్శ్వ దృష్టితో చిత్రించేవారు. ఈ పద్ధతిలో వ్యక్తి ముఖం నేరుగా వీక్షకుడిని చూస్తుంటే, మిగిలిన శరీరంలో సగభాగం వీక్షకుడి వైపు తిరిగివుండేది. పాదాలు కూడా సమంగా కాకుండా ఒకదాని వెనుక వున్నట్లుగా చిత్రించేవారు. ఇటువంటి పర్షియన్ సంప్రదాయ చిత్రణ, జహంగీర్ కాలంలో ప్రక్కకు పెట్టబడింది. ముఖ్యంగా జహంగీర్ కాలంలో రూపపట చిత్రణలో సృజనాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మూడువంతుల ప్రొఫైల్ లో చిత్రాలను రూపొందించే పద్ధతి ఆచరణలోకి వచ్చింది. పాదాలు, చేతుల చిత్రణలో కూడా సృజనాత్మకత మరింతగా పెరిగింది.
మొగలుల కాలంలో చాలా కాలంవరకు పోర్ట్రెయిట్‌లు పురుషులవే ఉండేవి. ఉన్నత వంశీయులు, రాచకుటుంబీకులైన పురుషులను వారి వారి సేవకురాళ్లు లేదా ఉంపుడుగత్తెలు సేవిస్తూ ఉండగా గీసిన చిత్రాలే ఎక్కువగా ఉండేవి మొఘల్ రూపపట చిత్రాలలో రాచకుటుంబాలకు చెందిన స్త్రీ మూర్తుల ప్రాతినిధ్యం గురించి పండితుల మధ్య చర్చ జరిగింది. కొంతమంది పండితులు జహానారా బేగం, ముంతాజ్ మహల్ వంటి ప్రసిద్ధ స్త్రీ మూర్తుల యొక్క పోలికలు ఏవీ లేవని పేర్కొన్నారు, మరికొందరు లఘు చిత్రాలలో గల స్త్రీ మూర్తుల చిత్రాలలో వారి ఉనికిని పేర్కొంటున్నారు. దీనికి రుజువుగా వీరు ఫ్రీయర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో భద్రపరిచబడిన మొఘల్ రాకుమారుడు 'దారా షికో' యొక్క ఆల్బమ్ లోని మిర్రర్ పోర్ట్రెయిట్ లో గల ప్రసిద్ధ స్త్రీ మూర్తులను ఉదహరిస్తున్నారు.
రిజా అబ్బాసి మాదిరిగా గీసినటువంటి ఏక వ్యక్తి (single figures) రూప చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందలేదు, కాని ప్యాలెస్ నేపథ్యంలో ప్రేమికుల దృశ్యాలను పూర్తిగా చిత్రించిన రూపపటాలు తరువాతి కాలంలో బాగా జనాదరణ పొందాయి. ముఖ్యంగా చిత్రాలలో ముస్లిం లేదా హిందువుల యొక్క పవిత్ర పురుషులను, ఆధ్యాత్మిక మూర్తులను చూపించే కళా ప్రక్రియ బాగా ప్రాచుర్యం పొందింది.
అక్బర్ స్వయంగా ఒక చిత్రపట ఆల్బంను కలిగి ఉండేవాడు. ప్రస్తుతం అందులోని చిత్రపటాలు చెల్లా చెదురై పలు విదేశీ మ్యూజియంలకు తరలిపోయాయి. ఈ ఆల్బంలో అతని ఆస్ధానికులందరి రూపపట చిత్రాలు పొందుపరచబడి ఉండేవి. దీనికి సహేతుకమైన కారణం ఉంది. చరిత్రకారుల ప్రకారం, అక్బర్ తన సలహాదారులతో వ్యక్తుల నియామకాల గురించి చర్చించేటప్పుడు, ఆ చర్చించబడుతున్న వ్యక్తులు ఎవరో గుర్తుకు తెచ్చుకునేందుకు చక్రవర్తి ఆ ఆల్బంను సంప్రదించేవాడని తెలుస్తుంది. ఆ విధంగా అక్బర్ కు తన జ్ఞాపకశక్తి పరీక్షించుకోవడానికి ఆ చిత్రపట ఆల్బం ఒక గీటురాయిగా వుపయోగపడేది. చిత్రాలలో వ్యక్తులతోపాటు ఆయా వ్యక్తుల సంబంధిత ప్రత్యేక వస్తువులను కూడా చిత్రించబడటం వలన వారిని గుర్తుపట్టడం చక్రవర్తికి సులభమైయ్యేది. అటువంటి ప్రతీక వస్తువులు లేని సందర్భాలలో వారి రూపపట చిత్రాలు సాదా నేపథ్యంలోనే ఉండేవి.
అక్బర్ చక్రవర్తిని చక్కగా చిత్రించిన రూపపటాలు చాలా ఉన్నాయి. అయితే అవి, అతని వారసులైన జహంగీర్, షాజహాన్ల కాలంలో చిత్రించబడ్డాయి. మొగలాయిల కాలంలోనే భారతీయ లఘు చిత్రలేఖనంలో పాలకుల రూపపటాలను చిత్రించడమనేది ఒక ప్రముఖ అంశంగా స్థిరపడింది. తరువాతి కాలంలో ఇది భారతదేశమంతటా ముస్లిం, హిందూ ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది.
ఝరోఖా దర్శన్ అనేది మరో కొత్తరకమైన చిత్రం. దీనిలో చక్రవర్తి ప్రజలకు బహిరంగ దర్శనం ఇవ్వడం కనిపిస్తుంది. ఇది అక్బర్, జహంగీర్, షాజహాన్ల పాలనలో రోజువారీ వేడుకగా జరిగేది. ఈ దృశ్యాలలో, చక్రవర్తి బాల్కనీలో లేదా కిటికీలో పైభాగంలో దర్శనమిస్తుంటే, క్రింద సభికుల గుంపు ఉంటుంది. అయితే ఇది ఇస్లాంకు విరుద్ధమని ప్రకటించిన ఔరంగజేబు దీనిని రద్దు చేసాడు. చిత్రపటాలలో కనిపిస్తున్న తేజోవలయ (halo) ప్రభావానికి తగ్గట్టుగానే చక్రవర్తుల బొమ్మలు కూడా ప్రముఖంగా కనిపిస్థాయి. తమను తాము, భూమిపై కనిపించే అల్లా ప్రతినిధులుగా లేదా దివ్యస్వరూపులుగా ప్రదర్శించుకోవాలనే మొఘల్ చక్రవర్తుల ఆకాంక్షను ఇటువంటి చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇతర రూపపట చిత్రాలలో చక్రవర్తి కొలువు తీరిన దృశ్యాలు, దర్బార్ లో సందర్శకులను ప్రవేశపెడుతున్న దృశ్యాలు, సింహాసనాధిరోహుడైన చక్రవర్తి దృశ్యాలు, దర్బారీ దృశ్యాలు ముఖ్యమైనవి. వేట దృశ్యాలతో కనిపించే రాచరిక రూపపట చిత్రాలు తరువాతి కాలంలో రాజపుత్ర చిత్రకళా శైలిలోను, మొఘల్ అనంతర శైలులలో బాగా ప్రాచుర్యం పొందాయి. 17 వ శతాబ్దం నుండి పాశ్చాత్య ప్రభావంతో గీయబడిన అశ్వరూఢులైన పాలకుల రూపపట చిత్రాలు బాగా జనాదరణ పొందాయి.
మొఘల్ చిత్రకళా వికాసం
[మార్చు]హుమాయూన్ (1530–40 నుండి 1555–56 వరకు)
[మార్చు]భారతదేశంలో రెండవ మొఘుల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సాహిత్యంలోనూ, కళలలోను చక్కని ప్రజ్ఞాశీలి. చిత్రకళ పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ. షేర్షా సూరి విజయంతో రాజ్యభ్రష్టుడైన హుమాయూన్, భారతదేశం విడిచి కాందిశీకుడుగా 1543 లో పర్షియాకు చేరుకొని అక్కడ సఫావిడ్ రాజవంశీయుడైన చక్రవర్తి షా తమస్ప్-I (Shah Tahmasp-I) యొక్క ఆశ్రయంలో తలదాచుకొన్నాడు. సహజంగానే చిత్రకళాభిమాని అయిన హుమాయూన్, గొప్ప కళాపోషకుడైన షా తమస్ప్ ను ఆశ్రయించడం, భవిష్యత్తులో భారతదేశంలో మొఘల్ చిత్రకళావిర్భావానికి గొప్ప వరప్రసాదమయ్యింది.
పర్షియా లోని తబ్రిజ్ లో ఆశ్రయం పొందుతున్నప్పుడు అక్కడ వర్ధిల్లుతున్న పర్షియన్ చిత్రకళా పద్ధతి హుమాయూన్ ను బాగా ఆకర్షించింది. అక్కడ షా తమస్ప్ దర్బార్ లోని మేటి ఆస్థాన చిత్రకారులైన బిహజాద్, మీరాక్, మీర్ ముసావ్విర్ వంటి వారి సాంగత్యంతో, హుమాయూన్ పర్షియన్ లఘుచిత్ర శైలి పట్ల అమితంగా ప్రభావితమయ్యాడు. అబ్దుస్ సమద్, మీర్ ముసావ్విర్ అనే ఇద్దరు ప్రసిద్ధ చిత్రకళాకారులను తనతో పాటు భారతదేశానికి రావలిసినదిగా ఆహ్వానించడమే కాకుండా వారి ద్వారా తబ్రిజ్ భాండాగారాలలో వున్నటువంటి గొప్ప చిత్రకళా ఖండాలను భారతదేశంలో సైతం సృష్టించాలని ఆశించాడు. అయితే కారణాంతరాల వల్ల మీర్ ముసావ్వీర్‌కు బదులుగా అతని కుమారుడైన మీర్ సయ్యద్ ఆలీ హుమాయూన్ వెంట రావలిసివచ్చింది.
పర్షియా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న హుమాయూన్, మధ్య దారిలో కాబూల్ పాలకుడు, తిరుగుబాటు సోదరుడైన కమ్రాన్ ను ఓడించాడు. 1553 లో కాబుల్ ను ఆక్రమించినపుడు, అక్కడ కమ్రాన్ నిర్వహిస్తున్న చిత్రశాలను కూడా స్వాధీనం చేసుకొని ఉండవచ్చు. బహుశా ఇక్కడ వున్నప్పుడే హుమాయూన్, మీర్ సయ్యద్ ఆలీ చిత్రకారునితో తన వంశ పూర్వీకుడైన తైమూర్ కు సంబంధించిన "ప్రిన్సెస్ అఫ్ ది హౌస్ అఫ్ తైమూర్" (తైమూర్ ఇంటి రాజకుమారులు) అనే చిత్ర కళాఖండాన్ని సృష్టింపచేసి ఉండవచ్చు. 1553 నాటికి చెందిన ఈ చిత్రం 1.15 చదరపు మీటర్ల కొలతలు గల అతి పెద్ద వస్త్రంపై చిత్రించబడింది. ఇటువంటి పెద్ద చిత్రాలు పర్షియన్ చిత్రకళా సంప్రదాయంలో అసాధారణమైనప్పటికీ మంగోల్ చిత్రకళా సంప్రదాయంలో మాత్రం సాధారణం. ప్రస్తుతం ఇది లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.
ఆ తరువాత సా.శ. 1555 లో భారతదేశానికి తిరిగి వచ్చినపుడు హుమాయూన్ తనతోపాటు ఇద్దరు ప్రఖ్యాత పర్షియన్ చిత్రకారులు-మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ లను భారతదేశానికి తీసుకొనివచ్చాడు. వీరు తరువాతి కాలంలో చిత్రలేఖనంపై హంజనామా లేదా దస్తాన్-ఇ అమీర్ హంజా (Dastan-e Amir Hamza) అనే గొప్ప సచిత్ర గ్రంథం రచించారు. వీరి రాకతోనే భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభమైందని పేర్కొంటారు. హుమాయూన్, కుటుంబ సభ్యుల సమేతంగా తనను రెండు లఘుచిత్రాలలో చిత్రించడం కోసం కొందరు చిత్రకారులను నియమించాడని తెలుస్తుంది. పర్షియన్ కళా సంప్రదాయంలో ఇలా చిత్రించడం చాలా అరుదైనప్పటికీ మొగలులలో ఇది సాధారణ విషయం.
అక్బర్ (1556-1605)
[మార్చు]అక్బర్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ విద్యాసక్తి, ఉత్తమ కళాభిరుచి గలవాడు. తన యవ్వనంలో అబ్దుస్ సమద్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. స్వతహాగా చిత్రకారుడు కూడా కావడంతో అక్బర్ చిత్రకళను గొప్పగా ప్రోత్సాహించాడు. ఉన్నది ఉన్నట్లుగా గీయగలిగిన చిత్రకారుడు మాత్రమే సృష్టికర్త ఆధిక్యతను గ్రహించగలడు. చిత్రకారుని అంత వాస్తవికతతో గీయగలిగిన వస్తువులలో సృష్టికర్త ప్రాణం పోస్తాడు అనే అభిప్రాయం అక్బర్ కు ఉండేది. అక్బర్ హాయంలో అతని దర్బార్ విస్తారమైన మొఘల్ సామ్రాజ్య పరిపాలనాధికారానికి కేంద్రంగానే కాక సాంస్కృతిక కళా నైపుణ్య కేంద్రంగా ఉద్భవించింది. లలితకళలన్నిటిలోను చక్కని సాన్నిహిత్యం కలిగివున్న అతని కాలంలో మొఘల్ చిత్రకళ సార్వతోముఖంగా అభివృద్ధి చెందింది.
అక్బర్ తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన కళా భండాగారాన్ని (లైబ్రరీ) ని విస్తృతపరచడమే కాకుండా ఆస్థాన చిత్రకారుల బృందాన్ని మరింతగా విస్తరించాడు. చిత్రకళాభివృద్ధికై ఆగ్రాలో రాచరిక చిత్రశాలను నెలకొల్పడమే కాకుండా ఆ చిత్రశాల నుండి రూపొందుతున్న చిత్రాలపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి మరీ పర్యవేక్షించేవాడని తెలుస్తుంది. అక్బర్ చిత్రకళా పోషణ గురించిన వివరాలు అబుల్ ఫజల్ కావ్యంలో పేర్కొనబడ్డాయి. వందమందికి పైగా చిత్రకారులు అతని ఆస్థానంలో ఉండేవారని, వారిలో పదమూడు మంది ప్రముఖ చిత్రకారులని తెలుస్తుంది. వీరిలో అతని తండ్రి హుమాయూన్ వెంట వచ్చిన మీర్ సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ లతో పాటు దశ్వంత్, ముకుంద, బసవన్, ఫరూక్ బేగ్, ఖుస్రూ ఖులీ, కేశవ లాల్, హరిబంద్, మధు, జగన్ మొదలైనవారు ప్రసిద్ధులని ఐనీ అక్బరీ గ్రంథం పేర్కొంది. ముఖ్యంగా అబ్దుస్ సమద్ ముందు అక్బర్ స్వయంగా వివిధ భంగిమలలో కూర్చొని తన చిత్రాలను వేయించుకొనేవాడని అబుల్ ఫజల్ పేర్కొన్నాడు.
అక్బర్ దర్బార్ లో సుమారు 11 మంది ముస్లింలు 6 గురు హిందువులు ఆస్థాన చిత్రకారులుగా ఉండేవారు. వారు తమ ప్రతిభా సంపన్నతతో మొఘల్ చిత్రకళకు వన్నెలు తెచ్చారు.వీరందరిలో అబ్దుస్ సమద్ నిస్సందేహంగా సాటిలేని మేటి చిత్రకారుడు. అతనికి షిరిన్ కలం లేదా మధుర లేఖిని అనే బిరుదు ఉండేది. మొఘల్ చిత్రకళకు పునాది వేసినవాడు అబ్దుస్ సమద్. నిజానికి అతనితోనే మొఘల్ చిత్రకళ ఆరంభమైందని పేర్కొంటారు. అతని శిష్యులలో దశ్వంత్ ప్రసిద్ధుడు. పేద పల్లకీ బోయీ కొడుకైన దశ్వంత్ ను అక్బర్ కనిపెట్టి అతనిని ప్రోత్సాహించాడు. పర్షియన్ కళారీతిని ఆచరిస్తూ ఒక నూతన కళావైచిత్రిని సృష్టిస్తున్న హిందూ చిత్రకారులకు దశ్వంత్ ఒక ప్రతీకగా ఉండేవాడు. మరో చిత్రకారుడు గోవర్ధన్ అక్బర్, జహంగీర్, షాజహాన్-ముగ్గురు చక్రవర్తుల కాలంలోను ప్రసిద్ధుడు.
మొఘల్ సచిత్ర గ్రంథాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంథాలు) మొట్ట మొదటిది తుతినామా (టేల్స్ ఆఫ్ ఎ పారట్). దూరప్రయాణీకుడైన భర్త ఇంట లేని సమయంలో, ప్రేమికుడి నుంచి దూరంగా ఉంచడానికి ఒక స్త్రీకి, ప్రతీరోజు రాత్రి ఆమె పెంపుడు చిలుక చెప్పిన 70 శృంగారభరితమైన కథలు సంస్కృతంలో శుకసప్తతి (12వ శతాబ్దం) పేరుతొ ప్రసిద్దమయ్యాయి. దీనిలోని 52 కథలను నఖ్షాబి (14వ శతాబ్దం) తుతినామా పేరుతొ పర్షియన్ భాషలో అనువదించడం జరిగింది. 1560, 1566 మధ్య కాలంలో మీరు సయ్యద్ ఆలీ, అబ్దుస్ సమద్ లాంటి మేటి చిత్రకారులు తుతినామా పర్షియన్ గ్రంథానికి ఆగ్రా రాచరిక చిత్రశాలలో చక్కని చిత్రాలు సమకూర్చారు. ఈ గ్రంథంలో 250 వరకు లఘుచిత్రాలు ఉన్నాయి. ఇందులోని ఒక లఘుచిత్రంలో గీయబడిన 'కథలోని రాజు' చిత్రమే, అక్బర్ యొక్క మొట్టమొదటి చిత్రం. చక్కని చిత్రాలతో తుతినామా రూపు దిద్దుకొన్నప్పటికీ అందలి చిత్రాలు మాత్రం చాలా సరళంగా ఉన్నాయి. ఇది తొలి దశలో వున్న మొఘల్ చిత్ర నిర్మాణ శైలిని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ సచిత్ర గ్రంథం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్ మ్యూజియంలో ఉంది. 1580లో అక్బర్ కోసం తుతినామా యొక్క రెండవ సచిత్ర గ్రంథ ప్రతిని తయారుచేయడం జరిగింది. ఈ రెండవ ప్రతిలోని అధిక భాగం నేడు డబ్లిన్‌లోని చెస్టర్ బీటీ లైబ్రరీలో ఉంది.
తుతినామా తరువాత అక్బర్ పురమాయించిన రెండవ భారీ ప్రాజెక్ట్ "హంజనామా". సచిత్ర గ్రంథాలలో హంజానామా రూపొందిన తీరు మొఘల్ చిత్రకళా జగత్తులోనే అసాధారణమైనది. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ పర్షియన్ గ్రంథంలోని కథలపై అక్బర్ కు చిన్ననాటి నుండి ఆసక్తి మెండుగా ఉండేది. చక్రవర్తి అయిన పిదప చక్కని చిత్రాలతో హంజనామాను పునఃసృష్టించవలసిందిగా చిత్రకారులను పురమాయించాడు. అక్బర్ అభీష్టానుసారం హంజానామా గ్రంథాన్ని అందమైన చిత్రాలతో పునఃసృష్టించే బృహత్తర కార్యక్రమం 1562 లో ఆగ్రా లోని రాచరిక చిత్రశాలలో మీర్ సయ్యద్ ఆలీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
హంజనామా గ్రంథానికి అసాధారణ సైజులో వున్న నూలు వస్త్రపు పేజీల మీద, దాదాపు 1,400 కు పైగా పూర్తి పేజీ (full page) లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. ఈ చిత్రాలు 69 సెం.మీ. x 54 సెం.మీ. (సుమారుగా 27 x 20 అంగుళాలు) సైజులో వున్న పెద్ద పేజీల మీద గీయబడ్డాయి. అందులోను సాధారణ కాగితం మీద కాకుండా నూలు వస్త్రంమీద చిత్రించబడ్డాయి. ఈ గ్రంథంలో శృంగార సన్నివేశాలు, బెదిరింపు సంఘటనలు, తృటిలో తప్పించుకోనే దృశ్యాలు, హింసాత్మక దృశ్యాలు-ఇత్యాది దృశ్యాలను వివరిస్తూ వందలాది చిత్రాలు గీయబడ్డాయి. మొత్తం మీద వందలాది రమణీయమైన చిత్రాలతో, 4,800 పేజీలతో, 14 సంపుటిలతో హంజనామాకు సచిత్ర గ్రంథ ప్రతి రూపొందింది. అక్బర్ యొక్క హంజనామా రాతప్రతి (manuscript) లో నూలు వస్త్రం మీద గీసిన 1400 లఘుచిత్రాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ప్రతీ పేజీని తెరవగానే ఒక లఘుచిత్రం, ఆ చిత్రాన్ని చూసిన చక్రవర్తికి సులభంగా అర్థమయ్యేటట్లు ఆ పేజీ వెనుక భాగాన చిత్రానికి సంబంధిత వచనం వ్రాయబడింది.
ఈ గ్రంథానికి బొమ్మలు సమకూర్చడం 1562 లో ప్రారంభమై 1577 వరకూ అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఈ సచిత్ర గ్రంథ సృష్టిలో 30 మందికి పైగా ముఖ్య చిత్రకారులు ప్రధాన పాత్ర వహించారు. ఈ బృహత్కార్యానికి మొదట మీర్ సయ్యద్ ఆలీ తరువాత అబ్దుస్ సమద్ చిత్రకారులు నేతృత్వం వహించారు. ఈ అసాధారణ చిత్ర రచనా కృషిలో పర్షియన్ చిత్రకారులతో పాటు సుమారు వంద మందికి పైగా భారతీయ చిత్రకారులు సమష్టిగా పాలుపంచుకున్నారు. పర్షియా నుండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిత్ర కళాకారుల యొక్క విభిన్న శైలులను ఒకే ఏకీకృత శైలిలో రూపొందించడానికి హంజనామా గ్రంథం ఒక సాధనంగా ఉపయోగపడింది. 14 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ చిత్ర రచనా యజ్ఞం పూర్తయ్యేసరికి ఇండో, పర్షియన్ శైలి మేళవింపులతో కూడిన మొఘల్ చిత్రకళా శైలి పరిపక్వతకు చేరుకుంది. పర్షియన్ చిత్రకళలోని మంద్ర వర్ణాలు, అలంకృత మేళవింపులు మొఘల్ చిత్రకళలో వచ్చేసరికి సువిశాలమైన స్థల సృష్టిలో నింపబడిన బొమ్మలుగా రూపాంతరం చెందాయి.
ఫతేపూర్ సిక్రీలోని రాచరిక చిత్రశాల అనేక పర్షియన్, భారతీయ కావ్యాలకు ఇలస్ట్రేషన్ చిత్రాలను (గ్రంధస్త విషయ వివరణ చిత్రాలు) రూపొందించింది. 1582 లో సాది షిరాజి యొక్క మహత్తర రచన గులిస్తాన్ (పూల తోట) కు చిత్రాలు సమకూర్చబడ్డాయి. పారశీక పౌరాణిక రాజు దరాబ్ సాహసకృత్యాలను వివరించే దరాబ్-నామా గ్రంథానికి 1585 లో చిత్రాలు చేర్చబడ్డాయి. 1585 నాటికి నిజామి ఖమ్సా గ్రంథానికి అనేక ప్రసిద్ధ చిత్రాలు గీయబడ్డాయి. 36 ప్రకాశవంతమైన పేజీలతో వున్న నిజామి ఖమ్సా లోని చిత్రాలలో వివిధ కళాకారుల యొక్క విభిన్న శైలులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చిత్రాలు సాంప్రదాయక పర్షియన్ కళా ప్రభావం నుండి బయటపడినట్లు కనిపిస్తాయి. లాహోర్లో జామీ యొక్క రచన బహరిస్తాన్ (వసంత తోట) కు 1590 లలో చిత్రాలు జతపరచబడ్డాయి. బహరిస్తాన్ (9వ శతాబ్దం) గులిస్తాన్ శైలిలో రాయబడిన కావ్యం.
మొఘల్ కాలపు చిత్రకారులు
[మార్చు]- మజహర్ అలీ ఖాన్: 19వ శతాబ్దంలో చివరి-మొఘల్ శకంలో ఢిల్లీకి చెందిన చిత్రకారుడు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Museum, Victoria and Albert. "One of four drawings of Mughal architecture. | Unknown | Khan, Mazhar Ali | V&A Explore The Collections". Victoria and Albert Museum: Explore the Collections (in ఇంగ్లీష్). Retrieved 2021-08-17.