వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 36వ వారం
మంగళగిరి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం మరియు అదే పేరుగల మండలం. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరు కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ మంగళగిరి పానకాల స్వామిగా పూజలందుకొంటున్న పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం గల చారిత్రాత్మక పట్టణం. ప్రసిద్ధి చెందిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, ఆపై ఆనందగోత్రిజులు, విష్ణు కుండినులు - ఇలా ఎన్నో రాజవంశాల పాలనలో మంగళగిరి ప్రాతం ఉంది. కుతుబ్షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాము పాలనలోను ఉన్నది. తరువాత కంపెనీ పాలన. 1831లో అతివృష్టి కారణంగా రైతులు పంటను కోల్పోయారు. మరుసటి యేడాది తుఫాను కారణంగా పంటలు నాశనమయ్యాయి. 1833లో భయంకరమైన కరువు ఏర్పడింది.ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వూరి ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసనస్థంభం వీధి ఉంది. మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కళ్యాణ పుష్కరిణి 1807-09లో నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసి వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. పానకాలస్వామి దేవాలయం మెట్ల మొదట్లో ఉన్న శాసనం శ్రీ కృష్ణదేవరాయలచే వేయించబడినదని చెబుతారు. పూర్తివ్యాసం : పాతవి