Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/తఱిగొండ వెంగమాంబ

వికీసోర్స్ నుండి

తఱిగొండ వెంగమాంబ.

                క. కందువమాటల సామెత !
                    లందముగాఁగూర్చి చెప్పనవి తెనుఁగునకుం
                    బొందైరుచియై వీనుల !
                    విందై ! మఱికానిపించు విబుధుల కెల్లన్.
                                                             మొల్ల.

తఱిగొండ వెంగమాంబ వసిష్ఠగోత్రికుఁడును నందవరీక బ్రాహ్మణుఁడునగు కృష్ణయ్యయను నాతనిపుత్రిక. ఈమె వాసస్థానము కడపమండలములోని తఱిగొండయని యూహింపఁబడుచున్నది. వెంగమాంబ తెలుఁగునందు విద్వాంసురాలని యామెచే రచియింపఁబడిన గ్రంధములే వేనోళ్లఁ దెలుపుచున్నవి. వేంకటాచలమహాత్మ్యమునం దీమె ఆశ్వానాదిని వేసిన శ్లోకములవలన సంస్కృతమునందును నీమెకుఁగొంత పరిచయము గలదని తోఁచుచున్నది. ఈమె బాలవితంతువు. వేదాంతగ్రంధపఠనము వలనను, గ్రంధరచనవలనను కడపమండలములోనేగాక తెనుఁగుదేశము నందంతటను వెంకమ్మగారి కీర్తి విస్తరిల్లెను. కాన జనులామెయం దధికవిశ్వాసముఁగలిగి దేశాచారప్రకార మామెపై ననేకకధలను జెప్పుకొనసాగిరి. అవి యన్నియు నిందుదాహరించుట యనావశ్యకము గాన నొకటి రెంటిని మాత్రమిందుదాహరించెదను.

వెంగమాంబ గ్రంథరచన చేయుచు నేకాంతముగా నొకగదిలో కూర్చుండుచుండెను. అచటినుండి యామె యీ వలికి రాఁగానే యామె ముఖమునం దానందమును, దేహమునందు సుగంధమును గానవచ్చు చుండెనఁట. ఇందువలననామె వదినలామెయందు దోషముకలదని తలఁచి దానిని గనిపెట్టుట కయి యాగదిద్వారముకడ కాచియుండిరఁట. అంతఁ గొంతసేపటికి లోపల నెవ్వరో పురుషుఁడు నవ్వినట్టును, నృత్యము చేసినట్టును వారికి వినఁబడెనఁట. అందుపై వారు తమభర్తలను బిలిచి తాము విన్నసంగతులను దెలిపిరఁట. అట్లందఱు గుమిగూడి వెంకమ్మను తలుపు తెఱవుమనఁగానామె నిర్భయముగాఁ దలుపు తీసెనఁట. అప్పుడు వారాయఱనంతను శోధించి పురుషుని నెవ్వనిని గానక యామె నడుగఁగా శ్రీకృష్ణుఁడుదప్ప నన్యపురుషుఁడేల వచ్చునని పలికెనఁట. ఇవి యన్నియునామె భక్తివిశేషమును దెలుపుకధలేగాని వేరుగాదు.

వెంగమాంబ తనజీవితకాలమునం దంతను శిరోజముల నుంచుకొనినందున జనులామె యన్న దమ్ములను బహిష్కరించెదమని బెదరించిరి. వారంతటితో నూరకుండక శంకరస్వాములవారు రాఁగా నాలోకగురున కీమెసంగతి విన్నవించిరి. అందుపై నాస్వాములవారు వెంకమ్మను బిలిచి నీశిరోజములు తీయించుకొమ్మని చెప్పెను. అందు కామె యించుకయు జంకక పరమేశ్వరుఁ డిచ్చినవి మనుజులేల తీయవలెననియు, అందువలన పరపురుషస్పర్శదోషము కలుగుననియు, ఒకపర్యాయము తీసిననవి మరల రానియెడలనది పరమేశ్వరునకు సమ్మతమనియు, అట్లుగాక మఱుదినముననే మరల వెండ్రుకలు మొలచుటచే నది పరమేశ్వరునకు నసమ్మతమని స్పష్టముగాఁ దెలియుచున్న దనియు, వాదించెను. అంతటితో నూరకుండక గురు వాజ్ఞాపింపఁగా బంధువులామెను బట్టుకొని బలవంతముగా కేశవపనము చేయించిరనియు, అందుపై నామె నదికిపోయి స్నానముచేయఁగా వెంటనే పూర్వమువలెనే కేశములు మొలిచెననియు, అదిగని గురువులును, బంధువులును మిగుల నాశ్చర్యపడి యటుతరువాత నామెజోలి మాని రనియుఁ గొందఱు చెప్పెదరు. ఏది యెట్లున్నను వెంగమాంబగారికి వితంతు స్త్రీలకు కేశవపనము చేయుట కిష్టము లేదనుట వాస్తవము.

వెంగమాంబగారికి నిష్టములేని యీకృత్యము ఏస్త్రీలకును సమ్మతంబు కానేరదు. మన దేశమునందు నంధపరంపరగా వచ్చిన యీయాచారమునకుఁ గాదనలేక కొందఱు యువతులు సమ్మతించినటుల నగుపడినను వారి యంతరముల యందు నపరిమితదు:ఖము కలిగియే యుందురు. వారివారి భర్తల మరణ సమయమునకంటెను కేశవిసర్జన కాలముల యందే వారధికదు:ఖితు లగుచుందురు. వపనకర్మవలన దమకును దమభర్తలకునునిజముగాఁ బుణ్యలోకములు దొరకునని వారికి నమ్మకమున్నయెడల వారాసమయములయందు దు:ఖించుటకు మారుగా నమితసంతోషమును బొందవలసినదే. స్త్రీలు పతివిహీనలై యలంకారరహితమై మంగళకార్యములకు దూరలై మితిమీరిన దు:ఖవహ్నిలోఁ బొరలుచుండ సుఖమునందున్నవారి బంధువులు మంచిమాటలతో వారిశోకాగ్ని నార్పుటకు మారుగా బరమేశ్వరుఁ డిచ్చినకిరీట మనఁదగిన కేశకలాపమును నేలపాలుచేసి యాదు:ఖాగ్నిలో నెయ్యిబోసి ప్రజ్వలింపఁ జేయుదురు. ఇది యెంతటి యన్యాయము ! ఈ దురాచారము సహగమనమునకంటెను దక్కువ క్రూరమై నది యయినను గొందఱు యువతుల కిది సహగమనమునకన్నను విశేషభయంకరమయినదని తోఁచుచున్నది. వారిట్లువిరూపులై నలుగురిలో నవమానకరమగు నిట్టిబ్రతుకు బ్రతుకుటకంటెను సహగమనముచేసి యొకగడియ దు:ఖముతో దేహము విడుచుట నూఱురెట్లెక్కువ సులభమని తలఁచుచున్నారు. వారు సహగమనము లేక పోవుటకు విశేషచింత నొంది దాని మాన్పినవారినే క్రూరులని నిందింపుచున్నారు. సాధారణముగ పురుషుల కయినను దుస్సహమగు నవమానము కలిగి బ్రతుకుటకంటెనుమరణమే సుఖదాయకముగ నుండునని తోఁచుట సహజము. ముందుఁ దమకవమానము కలుగునని తెలిసి యాత్మహత్య చేసికొనిన పురుషు లెందఱో కలరు. ఇందువలన సహితము నవమానముకంటె మరణమే మేలని జనులకుఁ దోఁచునని మనకు దెలియుచున్నది. కాననస్మద్దేశబాంధవు లందఱును మనదేశములోని స్త్రీలకుఁ గలుగుచున్న యీవ్యసనకరమగు నవమానమును దొలఁగింప బ్రయత్నింతురు గాత.

ఈమె మిక్కిలి వృద్ధురాలయి కాలధర్మము నొందెను. 1840 వ సంవత్సరము వఱ కీమె జీవించియున్నట్టు తెలియుచున్నది. బాలవితంతు వై నందున నీమెభర్త నామగోత్రము లెచటనుఁ గానరావు. వెంగమాంబచే రచియింపఁబడిన గ్రంథములలో రాజయోగసార మనువేదాంతపరమయిన ద్విపద కావ్యమును, వెంకటాచల మాహాత్యమును మాత్రము ముద్రింపఁబడి యున్నవి. వీనిలో రాజయోగసారము భాగవతము నందలి తృతీయ స్కంధాంతర్గతమైన కపిలదేవహూతి సంవాదమునుగొని మిగులరసవంతముగాను, సులభముగాను, ద్విపదకావ్యముగా రచియింపఁబడినది. దీనిలో సామాన్య జనంబులకుఁ గూడ సులభముగా తెలియునటుల వేదాంతము వివరింపఁబడినది. వేంకటాచల మాహాత్మ్యమునందు విష్ణుమూర్తి పద్మావతిని వివాహమాడినకథ మిగుల చిత్రముగాఁ జెప్పఁబడియున్నది. కడమగ్రంధములేవియు ముద్రింపఁబడనందున వానిని గుఱించి యేమియు వ్రాయుటకు వీలులేదు. "ఈమె కవిత్వమునం దల్పదోషము లక్కడక్కడఁ గానవచ్చుచున్నను మొత్తముమీఁద కవన మతికఠినముగాక మృదుమధురరచనను గలదియయి యున్నద"ని కవిచరిత్రమునందు రాయబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులవారీమె కవిత్వమును బొగడిరి. ఇట్టివారిచేఁ బొగడొందఁ దగినవిద్యయుఁ గవిత్వశక్తియుఁ గలిగినను నీమె యిసుమంతయు గర్వములేక మిగుల వినయవతిగా నుండెనని రాజయోగసారములోని యీక్రింది ద్విపదలు వెల్లడించుచున్నవి.

                ద్వి. వినరయ్య కవులార విద్వాంసులార
                      వినరయ్య మీరెల్ల విమలాత్ములార
                      ఘనయతిప్రాస సంగతులు నేనెఱుఁగ
                      వరుస నాక్షేపింప వలదు సత్కృపను.

ఈమె రచియించిన గ్రంథములు తఱిగొండ నృసింహస్వామి కంకితములు చేయఁబడినవి. ఈమె శృంగారరసాధిదేవత యగుకృష్ణుని భక్తురాలయినను ఆమెకుఁ దనగ్రంథములయం దెక్కడను శృంగారవాక్యములను జొప్పింప నిష్టములేకయుండెను. అందువలన నామెకృష్ణుని నిట్లు స్తుతియించెను.

                శా. శృంగారా కృతితోడ వచ్చి పదముల్ శృంగార సారంబుతోడంగూఢంబుగ
                     జెప్పు నీ వనిన నట్లేఁ జెప్పలే నన్ననన్ ముంగోపంబున జూచిలేచి యటనే మ్రొక్కంగ
                     మన్నించితచ్ఛృంగారోక్తులు తానే పల్కికొను నా శ్రీకృష్ణు సేవించెదన్

ఇందువలనఁ దనగ్రంధములయందు శృంగారవాక్యముల నిముడ్చుటకుఁ దన కెంత మాత్రము నిష్టములేకుండఁగా సందర్భానుసారముగా నాగ్రంధములయం దక్కడక్కడ వచ్చిన శృంగారపద్యములను శ్రీకృష్ణుఁడే రచియించెనని యామె తెలుపుచున్నది. ఈ విద్యావతి కవనరీతినిఁ దెలుపుటకయి ముద్రిత గ్రంధములోని కొన్ని పద్యము లిం దుదాహరించి యీమె చరితము ముగించెదను.

వేంకటాచలమహాత్మ్యము.

                ఉ. రామనృపాల ఘోరతరరావణ శౌర్యవిఫాల భవ్య స
                    త్రామసురార్య యోగిజనతాపసపాల కృపాలవాల
                    భూమిసుతాత్మలోల పరిపూర్ణ సుకీర్తివిశాల వానర
                    స్తోమముతోడ వచ్చు మిముఁ జూచి కృతార్థుల మై మిద్ధరన్. - ఆ. 1

                చ. వినియది భీతి నొందుచు వివేకముతో ద్విజుమోము జూచి
                     ట్లనియెను జారకాంతను మహావిషసర్పమునంటియెవ్వరై

                 నను గడతేరినారె నినునమ్మినభార్యను వీడి నన్నుఁబొం
                 దిన నిహమున్ బరంబు చెడు ధీరతతోఁ జను బ్రాహ్మణోత్తమా. - ఆ. 4.

                              రాజయోగసారము

           ద్వి. సంపద గలిగిన సామర్థ్య మనుచు
                సొంపు మీఱిన తుచ్ఛసుఖ మిచ్ఛయించి
                కామాంధులై తమగతిఁ గానలేక
                భామల వలలోనఁ బడి లేవలేక
                తఱగని యీషణత్రయవార్ధిలోను
                మఱిమఱి మునుఁగుచు మమత రెట్టింప
                నాలుబిడ్డల కని యర్థంబు గూర్చి
                కాలంబు నూరకే గడపుచునుండి

                పుట్టుచు గిట్టుచుఁ పొరలు చుండెదరు.